గ్రేటర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ : సత్యవతి

గ్రేటర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ : సత్యవతి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకా నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గెలువడం పట్ల డివిజన్ ఇన్ ఛార్జీ, రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ, గ్రేటర్ ఓటర్లకు, ప్రత్యేకంగా చిలుకా నగర్ డివిజన్లో టిఆర్ఎస్ ను గెలిపించడం కోసం మహబూబాబాద్ నుంచి వచ్చి శ్రమించిన టీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానికంగా ఉండి పనిచేసిన డివిజన్ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, డివిజన్ ఓటర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ముందే ఊహించినట్లు చిలుకా నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గీత ప్రవీణ్ ముదిరాజ్ గెలువడంపై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల నమ్మకానికి తగ్గట్లు డివిజన్ లో అందుబాటులో ఉంటూ, పార్టీ ఎజెండా మేరకు పనిచేసి వారి నమ్మకాన్ని మరింత పెంచుకునేలా పనిచేయాలని కార్పోరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ కు మంత్రికి సూచించారు. చిలుకా నగర్ లో ఫలితాలు ప్రకటించకుండానే గెలిచామంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రచారంలోనూ అబద్దాలు చెబుతూ… చివరకు అబద్దపు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మళ్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి గ్రేటర్ ప్రజల నమ్మకంలో తమదే అగ్రస్థానమని రుజువు చేసిందన్నారు. గోల్కొండపై కాషాయపు జెండా ఎగురవేస్తామన్న బీజేపీకి ప్రజలు సరైన బుద్ది చెప్పారని అన్నారు. గోల్కొండపై జాతీయ జెండా ఎగురేసిన టీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం ప్రకటించారని, టీఆర్ఎస్ పార్టీని అతిపెద్ద పార్టీగా గెలిపించిన గ్రేటర్ ఓటర్లు, కార్యకర్తలు, నేతలందరికీ ఆమె మరోసారి ధన్యవాదాలు తెలిపారు.