హైదరాబాద్: కేసీఆర్ బలమైన నాయకుడని తెలంగాణలో టీఆర్ఎస్ బలీయమైన రాజకీయ పార్టీ అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. తెలంగాణలో‘ బీజేపీ తుఫాన్’ వాదనలను ఆయన తోసిపుచ్చారు. తుఫాన్ ఉంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయేది కాదని ఒవైసీ చెప్పారు. బీజేపీ గెలిపించేందుకు హైదరాబాద్‌లో అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌ను తీసుకువచ్చి హైదరాబాద్‌లో ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఓటమి పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫలితాలపై పార్టీ అధినేత కేసీఆర్ సమీక్షించి రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతంగా మారుస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మేయర్ పీఠంపై తాము కింగ్ మేకర్ అని అనుకోవడంలేదని అన్నారు. ఈవిషయం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు తమతో సంప్రదించలేదని తెలిపారు. సంప్రదించినప్పుడు తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.