ఏపీలో ప్రభుత్వ సలహాదారులు అవసరమా..!
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో ప్రభుత్వ శాఖలకు సలహాదారులపై నియామకంపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారులపై తీవ్ర విమర్శలు చేశారు. వీరు సలహాదారులు కాదని.. స్వాహాదారులు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలు అంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన వాళ్లందరికీ ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు ఏపీ ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ నానాటికీ దిగజారుతుంటే సలహాదారుల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం సరికాదని తులసిరెడ్డి హితవు పలికారు. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని ఆయన ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వ సలహాదారులందరూ తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుంటుందని తులసిరెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని.. దీంతో వాళ్లు దొంగలుగా మారుతున్న పరిస్థితులు వచ్చాయని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.-