మెదక్ లో గర్జించిన టీయూడబ్ల్యూజే

మెదక్ లో గర్జించిన టీయూడబ్ల్యూజేమెదక్ జిల్లా: అధికార దాహంతో జర్నలిస్టులను దూషిస్తే సహించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జర్నలిస్టులపై అధికారంలో వున్న ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు, దూషణలను ఎండగడుతూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు మరోసారి గర్జించారు. జర్నలిస్టులపై దాడులను, దూషణలను ఖండిస్తూ బాధిత జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలంటూ పలు దఫాలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వార్త విలేకరి సంతోష్ నాయక్ పై పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, బెదిరింపులను నిరసిస్తూ గురువారం పటాన్ చెరువులోని తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మొదట భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరుసగా జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు. వీధి గూండాల్లా జర్నలిస్టుల పట్ల వారు అనుసరిస్తున్న ప్రవర్తనతో సభ్యసమాజం సిగ్గుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో వున్నామనే విషయాన్ని మరచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం విచారకరమన్నారు. వరుసగా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వున్నాయని విరాహత్ అలీ ధ్వజమెత్తారు. రాజ్యాంగేతర శక్తులు ఏ స్థాయిలో వున్నా వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టులకు వుందనే సత్యాన్ని రాజకీయనాయకులు మరిచిపోరాదని ఆయన సూచించారు. ఇందుకు నిదర్శనంగా 2001లో పటాన్ చెరువు ఎంపిపి అధ్యక్షుడిగా కొనసాగిన మహిపాల్ రెడ్డి తన తమ్ముడు మధుసూదన్ రెడ్డి ద్వారా అప్పటి వార్త విలేకరి శంకర్ రావుపై దాడి చేయించగా నాటి ఏపీయూడబ్ల్యూజే అతనికి తగిన బుద్ధి చెప్పిందని విరాహత్ గుర్తుచేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ అతన్ని అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్,  కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, డి.జి.శ్రీనివాస్ శర్మ, యూనియన్ రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శంకర్ దయాల్ చారీ, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, మోతె వెంకట్ రెడ్డి, వార్త జిల్లా ప్రతినిధి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.