ముంబై: శివసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్త అవాస్తమని నటి ఊర్మిళ మటోండ్కర్ అన్నారు. అసత్య ప్రచారాన్ని ఆమె ఖండించారు. మంగళవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సమక్షంలో ఆమె శివసేనలో చేరనున్నట్లు సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి. అయితే ఇదే అంశంపై తాము ఊర్మిళను ప్రశ్నించినప్పుడు.. శివసేనలో చేరడం లేదని స్పష్టంగా చెప్పినట్లు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. 2019లో కాంగ్రెస్ తరఫున ముంబై నార్త్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ.. తర్వాత ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పింది. తాజాగా ఆమె ఉద్ధవ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన హర్షల్ ప్రధాన్ వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంతేకాదు గవర్నర్ కోటాలో శాసన మండలికి ఊర్మిళ పేరును కూడా ప్రతిపాదిస్తూ గవర్నర్ బీఎస్ కోషియారీకి ఆమె పేరును పంపినట్లు కూడా అందులో ఉంది. అయితే తాను మాత్రం శివసేనలో చేరబోవడం లేదని ఊర్మిళ చెప్పడం గమనార్హం.