తొలిసారి విశాఖ చేరుకున్న ‘వందే భారత్’
వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ (Vande Bharat express) రైలు తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైల్వే స్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 8.40గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని విశాఖ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సురేష్ తెలిపారు.
ఇక్కడి నుంచి ఈ రైలును నిర్వహణ పర్యవేక్షణ నిమిత్తం న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కు పంపించారు. లోకో పైలెట్ క్యాబిన్‌కు అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ రైలు మొత్తం ఉంది. లోకో పైలెట్ ఆధీనంలో కోచ్‌ల ద్వారాలు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం ద్వారం వద్ద టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్ ఈ కోచ్ ప్రత్యేకత. ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
త్వరలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభంకానున్న వందే భారత్ రైలును సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారయ్యే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు నాలుగు పట్టాలెక్కాయి. అయిదోది మైసూర్-బెంగళూరు-చెన్నై రైలు గతేడాది నవంబర్ 10న పట్టాలు ఎక్కింది. దక్షిణ భారతానికి ఇదే తొలి రైలు.