త్వరలో పీఎంజీఎస్‌వై ప‌నులు పూర్తి చేస్తాం: ఎర్ర‌బెల్లి

త్వరలో పీఎంజీఎస్‌వై ప‌నులు పూర్తి చేస్తాం: ఎర్ర‌బెల్లిహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పీఎంజీఎస్‌వై రోడ్ల ప‌నులు అత్యంత వేగంగా, నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో జ‌రుగుతున్నాయ‌ని, ఎక్క‌డా రాజీ లేకుండా ప‌నులు నిర్వ‌హిస్తున్నామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు తెలిపారు. పీఎంజీఎస్‌వై (ప్ర‌ధాన‌మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న‌) రోడ్ల ప‌నుల‌పై కేంద్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి గిరిరాజ్ సింగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల మంత్రులు, కార్య‌ద‌ర్శుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా గురువారం ఢిల్లీ నుండి స‌మీక్షించారు. తెలంగాణ రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్‌ నుండి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సెక్ర‌ట‌రీ సందీప్ కుమార్ సుల్తానియా త‌దిత‌రులు పాల్గొన్నారు.

పీఎంజీఎస్‌వై ప‌నులు రాష్ట్రంలో అత్యంత వేగంగా నాణ్య‌త‌తో పూర్త‌వుతున్నాయని తెలిపారు. ఆయా ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర అధికారులు ప‌రిశీలిస్తూ, ప‌ర్య‌వేక్షిస్తూ ఉన్నార‌ని మంత్రి తెలిపారు. నిర్ణీత గ‌డువులోగా ఆయా ప‌నులు పూర్తి చేస్తామ‌ని మంత్రి కేంద్రానికి తెలిపారు. అలాగే స్టేట్ షేర్‌, సెంట్ర‌ల్ షేర్‌, మెయింటెనెన్స్ నిధులు వేగంగా అందేట్లు సీఎం కేసీఆర్ తో మాట్లాడ‌తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ స‌మీక్ష‌లో పీఎంజీఎస్‌వైతో పాటు రోడ్ క‌నెక్టివిటీ ప్రాజెక్ట్ ఫ‌ర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్‌, ప్ర‌ధాన మంత్రి గ్రామీణ ఆవాస యోజ‌న ప‌థ‌కాల‌పై కూడా స‌మీక్ష జ‌రిగింది. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పంచాయ‌తీరాజ్ ఇఎన్‌సి సంజీవ‌రావు, సంబంధిత శాఖ‌కు చెందిన ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.