వరంగల్ అర్బన్ జిల్లా: జీహెచ్ ఎంసి ఎన్నికల్లో బీజేపి, ఎంఐఎంలు ప్రజల మధ్య ఉద్వేగాలు పెంచి, విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో రూ.30 కోట్లతో సమకూర్చిన స్వీపింగ్ మిషన్లు, కంప ట్రాక్టర్లు, షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అన్ని కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుని, ప్రజలు టీఆర్ఎస్ ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిపించారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, సిఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ ల నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎవరితోనూ పొత్తు లేకుండానే జీహెచ్ఎంసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనేక చోట్ల అతి తక్కువ ఓట్లకే ఓడిపోయామని చెప్పారు. అయితే, ఓటమికి గల కారణాలను పార్టీలో సమీక్ష చేసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ మహానగరాన్ని అనేక విధాలుగా అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. త్వరలో జరగనున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపి నేతలు ఏం డెవలప్మెంట్ చేశారని, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారని మంత్రి ఎద్దేవా చేశారు.