అసలు ఈ పఠాన్ కథేంటి..!

అసలు ఈ పఠాన్ కథేంటి..!

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : అటు వివాదాల‌తో పాటు, ఇటు అంచ‌నాల‌తోనూ కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూ వ‌చ్చిన చిత్రం ‘ప‌ఠాన్’. అగ్ర క‌థానాయ‌కుడు షారుఖ్‌ఖాన్ నుంచి నాలుగేళ్ల త‌ర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పూర్తిస్థాయి చిత్రమిదే. షారుఖ్ క‌మ్‌బ్యాక్ చిత్రంగానూ, య‌శ్‌రాజ్ స్పై యూనివ‌ర్స్ చిత్రంగానూ సినిమాపై మొద‌టి నుంచే అంచ‌నాలు పెరిగాయి. బేష‌ర‌మ్ పాట‌లో క‌థానాయిక దీపికా ప‌దుకొణె క‌నిపించిన విధానం వివాదాలను రేకెత్తించింది. నాలుగేళ్ల నిరీక్షణ త‌ర్వాత షారుఖ్ అభిమానుల్ని మెప్పించాడా? ప‌ఠాన్ అంటే షారుఖ్‌ ఖాన్‌ గుండెల నిండా దేశ‌భ‌క్తి ఉన్న రా ఏజెంట్. ఓ సంఘ‌ట‌న త‌ర్వాత అజ్ఞాతంలో ఉంటాడు.

అసలు ఈ పఠాన్ కథేంటి..!

భార‌త‌దేశం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేశాక దేశంపై దాడికి వ్యూహం ప‌న్నుతాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి. అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీ ఔట్‌ఫిట్ ఎక్స్ చీఫ్ జిమ్ జాన్‌ అబ్రహంని రంగంలోకి దింపుతాడు. జిమ్ కూడా ఒక‌ప్పుడు భార‌త‌దేశం త‌ర‌పున ఏజెంట్‌గా ప‌నిచేసిన‌వాడే. మ‌రి ఎందుకు శ‌త్రువుల‌తో దోస్తీ చేశాడు భార‌త్‌పై వైర‌స్ దాడికి సిద్ధమైన జిమ్‌ని ప‌ఠాన్ ఎలా ఎదుర్కొన్నాడు? వీరిద్దరి మ‌ధ్యకు పాకిస్థాన్ ఐ.ఎస్‌.ఐ ఏజెంట్ రూబై దీపికా ప‌దుకొణె ఎలా వ‌చ్చింది? ఆమె క‌థేమిటి ఆమె ఎవ‌రికి ఎలా సాయం చేసిందనేది మిగ‌తా క‌థ‌.

స్పై థ్రిల్లర్ అన‌గానే క‌ళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, దేశ‌భ‌క్తి, ఊహించ‌ని మ‌లుపులు త‌దిత‌ర విష‌యాలే గుర్తుకొస్తాయి. వాటిని మ‌రో స్థాయిలో జోడించి చూపించడమే ‘ప‌ఠాన్‌’ ప్రత్యేక‌త‌. నాలుగేళ్ల త‌ర్వాత వ‌స్తున్న షారుఖ్ సినిమా కావ‌డంతో అభిమానుల్ని మ‌రింత‌గా అల‌రించేలా హీరోయిజాన్ని జోడించారు. ఆయ‌న‌కి మరో ఏజెంట్ స‌ల్మాన్‌ఖాన్ కూడా తోడై మెర‌వ‌డం ఈ సినిమాకి మ‌రిన్ని హంగుల్ని జోడించిన‌ట్లైంది. ఎప్పటిక‌ప్పుడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల‌కి అనుగుణంగా సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం మ‌రింత గ్రాండ్‌నెస్‌ని జోడించారు. దాంతో హాలీవుడ్ మార్వెల్ సినిమాల్ని చూస్తున్న అనుభూతి ప్రేక్షకుల‌కు క‌లుగుతుంది. క‌థ, క‌థ‌నాల కంటే కూడా ఈ సినిమాకి విజువ‌ల్స్ మాయాజాల‌మే హైలైట్‌గా నిలిచింది.

ఆకాశంలోనూ, మంచులోనూ, ట్రైన్‌లోనూ ఇలా భిన్న నేప‌థ్యాల్లో యాక్షన్ సన్నివేశాల్ని తెర‌కెక్కించారు. అవి ప్రేక్షకుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచుతాయి. కథ‌, క‌థ‌నాలే పెద్దగా ఆస‌క్తిని రేకెత్తించ‌వు. మ‌లుపులు కూడా ప్రేక్షకుడి ఊహకు త‌గ్గట్టే సాగుతాయి. షారుఖ్‌, జాన్‌, దీపికా ఈ మూడు పాత్రల‌కీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ, అవేవీ మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా లేక‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. అలాంటి లోపాల‌న్నింటినీ స్టార్ ప‌వ‌ర్‌, విజువ‌ల్స్ కప్పిపెడ‌తాయి. షారుఖ్‌ఖాన్, దీపికా, జాన్ అబ్రహం తెర‌పై క‌నిపించిన‌ప్పుడల్లా సినిమా మరోస్థాయిలో ఉంటుంది. ఆ ముగ్గురి పాత్రల్ని అలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా షారుఖ్‌, జాన్ మ‌ధ్య పోరాట ఘ‌ట్టాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

ఇవ‌న్నీ ఒకెత్తు అయితే స‌ల్మాన్‌ ఎంట్రీ మ‌రో ఎత్తు. విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాలు పెద్దగా మెప్పించ‌వు. ఓసైనికుడు త‌న‌కి దేశం ఏంచేసింద‌ని కాదు, తాను దేశానికి ఏం చేశాన‌నే ఆలోచిస్తాడంటూ షారుఖ్ చెప్పే సంభాష‌ణ‌లు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

ఎవ‌రెలా చేశారంటే : షారుఖ్‌ ఈ సినిమా కోసం స‌న్నద్ధమైన విధానం, తెర‌పై క‌నిపించినతీరు యువతార‌ల‌కుస్ఫూర్తిదాయ‌ అని చెప్పొచ్చు. మ‌రింత ఫిట్‌గా కనిపించారు. రొమాంటిక్ స‌న్నివేశాల‌తో మ‌న‌సులు దోచే ఆయన యాక్షన్‌తోనూ అద‌ర‌గొట్టాడు. ఆయ‌న‌కు, దీపికకు మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. బేష‌ర‌మ్ పాట‌తో పాటు, చివ‌ర్లో వ‌చ్చే పాట కూడా అల‌రిస్తుంది. జాన్, జిమ్ పాత్రకి సరిగ్గానప్పుతాడు. బ‌ల‌మైన విల‌న్‌గా క‌నిపించాడు. దీపికా పదుకొణె గ్లామ‌ర్‌గా క‌నిపించడంతో పాటు, పోరాట ఘ‌ట్టాల్లోనూ మెరిసింది. స‌ల్మాన్‌ ఓ పోరాట‌ ఘ‌ట్టంలో అల‌రిస్తాడు.

ప‌తాక స‌న్నివేశాల్లో మ‌న త‌ర్వాత ఎవ‌రు? అంటూ షారుఖ్‌తో ఆయన మాట్లాడే స‌న్నివేశాలు అల‌రిస్తాయి. డింపుల్ క‌పాడియా, అశుతోష్ మంచి పాత్రల్లో మెరిశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆక‌ట్టుకుంటాయి. కెమెరా ప‌నిత‌నం, పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకి ప్రధాన బ‌లం. సిద్ధార్థ్ ఆనంద్ ఆయ‌న బృందం మంచి క‌థ చెప్పడం కంటే కూడా సినిమాలో ఉన్న స్టార్ ప‌వ‌ర్‌కి త‌గ్గట్టుగా స‌న్నివేశాల్ని రాయ‌డంలో విజ‌య‌వంతం అయ్యారు. నిర్మాణం అత్యున్నతంగా ఉంది..