తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

– ఈవీఎంల పరిశీలన పూర్తి
– కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్‌ స్టేజ్‌కు చేరింది. సరిగ్గా మరో 5 రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి గందరగోళం కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్ డ్యూటీలో ఉండగా, లక్షా 60 వేల మందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌‌ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అందులో 56 వేల మంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబర్ 29 లోపు మరో లక్ష మంది ఎలక్షన్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్‌లో చెప్పింది ఒకటైతే, గ్రౌండ్ లెవల్‌​లో పోస్టల్ ​బ్యాలెట్ ప్రక్రియ మరోలా జరుగుతోందనే విమర్శలువ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుంటే, ఈ సారి అంగన్​వాడీలకు కూడా ఈసీ ఎన్నికల విధులు అప్పగించింది. వారికి సొంత పోలింగ్ స్టేషన్ల పరిధిలో కాకుండా ఇతర పోలింగ్​ కేంద్రాల్లో విధులు కేటాయించారు ఎన్నికల సంఘం అధికారులు. దాంతో ఈ ఎన్నికల్లో దాదాపు 30 వేలకు పైగా అంగన్​వాడీలు, ఇతర సిబ్బంది తమ పోస్టల్​ బ్యాలెట్‌ వినియోగించుకోలేక పోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఇతర సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ అవకాశం ఉంటుంది. ఎన్నికల విధుల్లో ఎక్కువగా టీచర్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొంటారు. అయితే వారికి సరిపడా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లేకపోవడంతో పోలింగ్‌ సిబ్బందిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల గందరగోళం వ్యవహారం ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పరిస్థితులను బట్టి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అందులో భాగంగా ప్రత్యేక పరిశీలకుల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లు సహా ఎన్నికల సంబంధిత అంశాలపై సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇప్పటికే హోం ఓటింగ్ పూర్తి అయిందని ఆయన తెలిపారు.ఫెసిలిటేషన్ సెంటర్లలో ఒక లక్ష 31 వేల ఉద్యోగులు, 35వేల మంది పోలీసులు, వెయ్యికి పైగా నాన్ గవర్నమెంటు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సీఈవో వెల్లడించారు. మొత్తం లక్ష 65వేల పోస్టల్ బ్యాలెట్ ఆమోదం తెలిపామన్న ఆయన, ఇప్పటి వరకు 95వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. అలాగే హోం ఓటింగ్ ద్వారా 26వేల మంది ఓటింగ్ పూర్తి చేసుకున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికల ఉల్లంఘన కింద భారీ ఎత్తున నగదు దొరుకుతోందని అన్నారు.

ఆదివారం మధ్యాహ్నం వరకు రూ. 709 కోట్ల సీజ్ చేశామన్నారు. అందులో రూ. 290కోట్ల వరకు నగదు ఉందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సీఈవో ఓటర్ల నిష్పత్తి 1000:1002గా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందుకోసం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్న సీఈవో, 54లక్షల 13వేల ఈపీఐసీ ప్రింటింగ్ పూర్తి అయిందన్నారు. ఓటర్ ఐడెంటీ కార్డులు బూత్ లెవ్ అధికారుల ద్వారా ఇంటింటికి పంపిణి జరుగుతుందని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామన్న సీఈవో వికాస్ రాజ్, మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. ఇందులో 221 మహిళా అభ్యర్థులు ఉన్నారన్నారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామని సీఈవో తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, హైదరాబాద్ జిల్లాలో 14, ఒక్కో జిల్లాలో ఒక్కొకటి చొప్పున ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న ఆయన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ, వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీ గా ఉండేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించేందుకు 45వేల తెలంగాణ పోలీసు విధుల్లో ఉన్నారని తెలిపారు.196 కేంద్ర బలగాలు వచ్చాయి, ఇతర రాష్ట్రాల నుంచి 24వేల హోం గార్డ్స్‌లను కూడా విధుల్లోకి తీసుకున్నామన్నారు. దివ్యాంగులు, వృద్దులు ఓటే వేసేందుక అన్ని చర్యలు తీసుకున్నామన్న సీఈవో ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్, ఒక సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇప్పటికే 80వేల వీల్ చైర్లను అయా జిల్లాలకు పంపామని తెలిపారు. పోలింగ్ సమాయానికి 48 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీఈవో తెలిపారు. 48 గంటల ముందే స్థానికేతరులు అయా ప్రాంతాలను విడిచి బయటకు వెళ్లిపోవాలన్నారు. సైలెంట్ పీరియడ్ లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదన్నారు