హైదరాబాద్ కు చేరుకున్న టీ మంత్రుల బృందం

హైదరాబాద్ కు చేరుకున్న టీ మంత్రుల బృందంహైదరాబాద్ : ధాన్యం సేకరణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు గత వారం నుంచి ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజులుగా కేంద్రమంత్రుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేకపోవడం, శనివారం క్రిస్మస్ సెలవు కావడంతో బృందం తిరిగివచ్చినట్లు సమాచారం.

గత శనివారం మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి , పసునూరి దయాకర్, వెంకటేశ్ నేతకాని బృందం ఢిల్లీకి వెళ్లింది.

ధాన్యం వార్షిక సేకరణ, ఈ వానాకాలం సీజన్ లో మిగులు ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి గోయల్ ను కలిసినా ఎలాంటి స్పష్టత రాలేదు. మళ్లీ కలిసి నిలదీద్దామని ప్రయత్నించినా ఆయన ఈ బృందానికి కలువకుండా ముఖం చాటేయడంతో తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది బృందం.

ఢిల్లీలో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్ కు వివరించి, తర్వాతి కార్యాచరణను రూపొందించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. సీఎం కేసీఆర్ మంత్రులతో సమావేశం అనంతరం మరోసారి సోమవారం లేదా జనవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.