రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ నిరుపేద వృద్ధుడు
వరంగల్ టైమ్స్, ఝార్ఖండ్ : రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావాలంటే.. ఏదైనా అద్భుతం జరగాలి. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ వంటి ప్రోగ్రామ్లో విజేతగా నిలవడమో.. లేక విలువైన వజ్రాలు దొరకడం లాంటి అదృష్టం వరించాలి. కానీ ఇవేవీ జరగకుండానే ఝార్ఖండ్లో ఓ నిరుపేద వృద్ధుడు కోటీశ్వరుడయ్యాడు. అది ఎలాగంటే..?వివరాల్లోకి వెళ్లితే… ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలో ఓ నిరుపేద వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని పెన్షన్ అకౌంట్లో సుమారు రూ.75 కోట్లపైనే జమ అయింది. జిల్లాలోని జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో ఫూలో రాయ్ తన కుమారుడు, భార్యతో కలిసి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
రాయ్కినారిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఇతనికి అకౌంట్ ఉంది. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి సమీపంలోని రూరల్ సర్వీస్ సెంటర్కు వెళ్లాడు ఫూలో రాయ్. రూ.10,000 విత్డ్రా చేసుకున్నాడు. కానీ అకౌంట్లో మిగిలిన డబ్బులు చూసి అవాక్కయ్యాడు. అకౌంట్లో రూ.75.28 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకూ తెలియదని చెప్పాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు.