ఉమ్మడి వరంగల్ లో ప్రేమికుల వరుస ఆత్మహత్యలు

ఉమ్మడి వరంగల్ లో ప్రేమికుల వరుస ఆత్మహత్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లా :పెద్దలు పెళ్లికి ఒప్పుకోరంటూ పలు ప్రేమజంటలు బలవన్మరణాలకు పాల్పడుతున్నాయి. కలిసి జీవించే అవకాశం లేక…విడిపోయి వేర్వేరుగా బ్రతుకలేక ప్రేమించుకున్నవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవ కాలంలో తెలంగాణలో పలువురు ప్రేమికులు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించి వారిద్దరూ బావిలో పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.ఉమ్మడి వరంగల్ లో ప్రేమికుల వరుస ఆత్మహత్యలుఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గార్ల మండలం రాజుతండా పరిధిలోని వడ్ల తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్ల అమ్రూ తండాలో ప్రేమజంట బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని రాజు తండాలో నివసించే ప్రశాంత్ , భూక్య ప్రవీణ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోరని భావించి పంచాయతీ వడ్ల తండ సమీపంలో బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వీరి ఆత్మహత్య విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా బావి వద్దకు తరలివచ్చారు. ప్రేమజంట ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఆరు రోజుల వ్యవధిలో మూడు ప్రేమజంటలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో డిసెంబర్ 18న ఓ ప్రేమ జంట వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన జరిగి 24గంటలు గడువక ముందే డిసెంబర్ 19న జనగామ జిల్లాలో మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికులు లక్ష్మీ, అంజయ్యలు పాలకుర్తిలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఘటనలు జరిగి నాలుగురోజులు గడవక ముందే మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని రాజు తండాలో ప్రేమజంట ప్రశాంత్ , భూక్య ప్రవీణలు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్నవయస్సులోనే ప్రేమపేరుతో ఆకర్షణకు గురవ్వడం, పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వంటి ప్రధాన కారణాలతో ప్రేమికులు బలవన్మరణాలకు గురవుతున్నారు.