ఈడీ విచారణకు నటి ఛార్మి హాజరు

ఈడీ విచారణకు నటి ఛార్మి హాజరుహైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మంది సెలబ్రిటీలకి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకుపైగా ఈడీ అధికారులు పూరీ జగన్నాథ్ పై ప్రశ్నల పరంపర కొనసాగించారు. పూరీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు ఈడీ అధికారులు నటి ఛార్మిని విచారించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం ఛార్మి ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఛార్మితో పాటు విచారణకు ఆమె చార్టెట్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఆమెతో పాటు 15 మంది బౌన్సర్స్ ఈడీ కార్యాలయం దగ్గరికి చేరుకొని హంగామా సృష్టించినట్లు తెలుస్తుంది.

పూరీ జగన్నాథ్ తో కలిసి పని చేస్తున్న ఛార్మీని ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంక్ లావాదేవీల వివరాలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు నిర్మించారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారడంతో పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లు బయటికి వచ్చాయి. కెల్విన్ అకౌంట్లో ఛార్మి డబ్బులు వేసిందా, కెల్విన్ తో ఆమెకు పరిచయం ఉందా, ఛార్మీ కెల్విన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేసింది నిజమేనా అన్న కోణంలోనూ ఈడీ విచారించనున్నట్లుగా తెలుస్తోంది.