డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు 

డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు

డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర కొత్త ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నేడు బాధ్యతలు చేపట్టారు. మహేందర్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్ కు అభినందనలు తెలిపారు. డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో అంజనీకుమార్ ను ఇంఛార్జ్ డీజీపీగా నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత మహబూబ్ నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో యేడాది పాటు విధులు నిర్వర్తించారు.

ఈ సమయంలో ఆయన రెండు సార్లు ఐక్యరాజ్యసమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా, గ్రేహౌండ్స్ చీఫ్ గా, నిజామాబాద్ రేంజ్ ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.