పీఆర్సీతో పాటు ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్

పీఆర్సీతో పాటు ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెల్పింది. 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ వనరులపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులకు సూటిగా చెప్పిన సీఎం జగన్ మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం ఫిట్మెంట్ పై ప్రకటన చేశారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు అమలుకానున్నాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుంది. పీఆర్సీ జులై1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది.

వీటితో పాటు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి, 2022 నుంచి పదవీ విరమణ వయస్సు పెంపు అమలుకానుంది. జూన్ 30 లోపు కారుణ్య నియామకాలు పూర్తిచేస్తామని పేర్కొంది. ఆరోగ్య పథకం అమలులో సమస్యలకు రెండు వారాల్లో పరిష్కారం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరికీ జూన్ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ సంవత్సరం జులై నుంచి ఇవ్వనున్నారు.

ఇక సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో- ఎంఐజీ లేఅవుట్స్ లోని ప్లాట్లలో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేయడమే కాకుండా 20 శాతం రిబేటును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని, ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ రిబేటును కూడా ప్రభుత్వమే భరించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.