జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్

జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్ముంబై : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 28 రోజుల తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి నేడు ఉదయం 11 గంటలకు విడుదలయ్యాడు. ఆర్యన్ తండ్రి షారుక్ ఖాన్ తో కలిసి మన్నత్ కు వెళ్లాడు. ఆర్యన్ ఖాన్ ను తన కారులో తీసుకుని వెళ్లేందుకు షారుక్ ఖాన్ స్వయంగా ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చాడు.

జైలు బయట, షారుక్ ఇళ్లు మన్నత్ వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. జైలు నుంచి విడుదల సమయంలో ఆర్యన్ ఖాన్ చాలా సంతోషంగా ఉన్నట్లు ఆర్థర్ రోడ్ జైలు అధికారి వెల్లడించాడు. ఇతర ఖైదీలతో చివరిలో కలిసి, మాట్లాడిన తర్వాత ఆర్యన్ బయటకు వచ్చాడు. అక్టోబర్ 2న ఆర్యన్ జైలుకు వెళ్లాడు. అయితే ఆర్యన్ కు బెయిల్ వచ్చింది కానీ, కేసు నుంచి మాత్రం బయటపడలేదు.

అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా ఆర్యన్ ఖాన్ ముంబై వదిలి వెళ్లకూడదు. ప్రతీ శుక్రవారం, ఎన్సీబీ కార్యాలయానికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వచ్చి హాజరవ్వాలి. ఆర్యన్ తన పాస్ పోర్ట్ ను ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా షరతు ఉల్లంఘించాల్సి వస్తే, ఎన్సీబీ ప్రత్యేక న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకోవాలి. ఇతర నిందితులతో సంబంధాలు పెట్టుకోరాదు. కోర్టు అనుమతి లేకుండా దేశం బయటకు వెళ్లకూడదు. విచారణకు సంబంధించిన విషయాలను మీడియా లేదా సోషల్ మీడియాలో పంచుకోకూడదు.