విజయగర్జన సభకు స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

విజయగర్జన సభకు స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లివరంగల్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించే విజయ గర్జన సభ ఏర్పాట్ల కోసం పార్టీ భారీ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే నగరంలోని రాంపూర్ సమీపంలోని స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఇప్పటికే మడికొండ, ఉనికిచర్ల, ఉర్సు రంగలీలా మైదానం సమీపంలోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.

తాజాగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాంపూర్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అక్కడి రైతులతోనూ మాట్లాడారు. కాగా, టీఆర్ఎస్ విజయగర్జన సభను 10 లక్షల మందితో విజయవంతం చేయడానికి, ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు తెలియచేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.