మధ్యప్రదేశ్ : ఓ మహిళ 28 ఏళ్లుగా చేస్తున్న నిరాహారదీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సం. ల మహిళ అయోధ్యలో డిసెంబర్ 6, 1992లో వివాదాస్పదకట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాసదీక్ష చేస్తున్నారు. రాముడికి మళ్లీ గుడి కట్టిన తరవాత మాత్రమే ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.వివాదాస్పదస్థలంలో రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదన్నారు. భూమిపూజ తరవాత అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్రస్నానం చేసి ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ‘‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. పూర్తి భారతదేశం మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’’ అని ట్వీట్ చేశారు.