అదో చారిత్రక క్షణం: అయోధ్యపై అద్వానీ

అదో చారిత్రక క్షణం: అయోధ్యపై అద్వానీఢీల్లీ: అయోధ్య శ్రీరామ మందిరం భూమిపూజ నేపథ్యంలో భాజపా అగ్రనేత అద్వానీ భావోద్వేగ సందేశం ఇచ్చారు. తనతోపాటు ప్రజలందరికీ ఇదో చారిత్రక, ఉద్వేగభరిత క్షణమన్నారు. 1990 లో సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను గుర్తు చేసుకున్నారు. దృఢమైన, సుసంపన్నమైన, శాంతి, సామరస్యంతో కూడిన భారతావనికి రామమందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని అద్వానీ విశ్వాసం వ్యక్తంచేశారు. అందరికీ సమన్యాయం, సుపరిపాలన అందాలని, దేశం రామరాజ్యంలా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వామి కావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, నాగరిక వారసత్వంలో శ్రీరాముడికి గౌరవస్థానం ఉందన్నారు. భారతపౌరుల్లో శ్రీరాముడి సద్గుణాలు ప్రేరేపించేందుకు ఆలయం దోహదపడుతుందన్నారు. కరోనా నేపథ్యంలో 93 ఏళ్ల అద్వానీ ఈ వేడుకకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.