శాసనసభకు బండి సంజయ్ పోటీ? 

శాసనసభకు బండి సంజయ్ పోటీ?

శాసనసభకు బండి సంజయ్ పోటీ? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? ఆయన పోటీ చేసే స్థానం కూడా ఖరారైపోయిందా? అనుచరులకు ఈ విషయంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. బండి సంజయ్ అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గంగుల కమలాకర్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆయనకు పరాజయం తప్పలేదు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత బండి సంజయ్ పై బీజేపీ క్యాడర్ లో ఒక్కసారిగా సానుభూతి పెరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా బండి సంజయ్ కి బీజేపీ హైకమాండ్ ఎంపీ సీటిచ్చింది. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన బండి దుమ్మురేపారు. ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ నే ఓడించారు. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి విజయఢంకా మోగించి, చరిత్ర సృష్టించారు. పార్టీ హైకమాండ్ దగ్గర ఫుల్ మార్కులు కొట్టేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ రాత్రికి రాత్రి హీరో అయిపోయారు. అంతేకాదు పార్టీ పెద్దలు ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండికి కీలక బాధ్యతలు అప్పగించి గౌరవించారు.

బండి సంజయ్ ఎప్పుడైతే తెలంగాణ బీజేపీ చీఫ్ అయ్యారో కమలం క్యాడర్ లో జోష్ వచ్చేసింది. అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న పార్టీలో కొత్త ఊపు కనిపించింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి జాయినింగ్స్ పెరిగాయి. కేసీఆర్ కు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో బీజేపీ ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ ఏది మాట్లాడినా గట్టి కౌంటర్ ఇచ్చే స్థితికి తెలంగాణ బీజేపీ చేరుకుంది. ఇలా బండి సంజయ్ వచ్చిన తర్వాత కమలం పార్టీలో ఇంతకు ముందెన్నడూ లేని వేగం కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. అంత బాగానే ఉంది కానీ తనకు అన్నిరకాలుగానూ బూస్ట్ ఎంపీ పోస్టుకు మరోసారి పోటీ చేసేందుకు బండి సంజయ్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆయన ఆసక్తిగా ఉన్నారని టాక్. అధిష్టానంతో ఇప్పటికే ఈ విషయాన్ని బండి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి పార్టీ పెద్దలు కూడా ఓకే అన్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కరీంనగర్ బీజేపీ క్యాడర్ తో బండి సంజయ్ భేటీ జరిగింది. ఆ సమావేశంలో తన పోటీపై ఆయన క్లారిటీ ఇచ్చేశారట. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పినట్లు టాక్. కరీంనగర్ స్థానం నుంచే పోటీ చేస్తానని కూడా బండి స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచారాయన. హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవిని పొందారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ మరోసారి గంగులను ఢీకొట్టేందుకు సిద్ధమవ్వడంపై క్యాడర్ కొంత అసంతృప్తితో ఉన్నారని టాక్. అయితే బండి మాత్రం అలాంటి టెన్షన్ అవసరం లేదని పార్టీ శ్రేణులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ లో బీజేపీ పరిస్థితిపై బండి సంజయ్ ఓ సర్వే చేయించారట. అందులో బీజేపీకి, బండి సంజయ్ కి ఫుల్ మార్కులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.