అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతే

అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతే

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వేలల్లో, లక్షల్లో జీతాలు తీసుకుంటూ అవికూడా సరిపోవని, అత్యాశతో అవినీతికి పాల్పడితే ఇక అంతే సంగతులు.. అవినీతి పరుల కోసం జ్వాల సంస్థ కాసుకొని కూర్చుంది. ఎక్కడ అవినీతిపరులు తమ విశ్వరూపం చూపిస్తారో ..అక్కడ జ్వాలా సంస్థ ఇట్టే పంజా విసురుతుంది. ఇలా జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎంతో మంది అవినీతి పరులు పట్టుబడ్డారు. అవినీతిలేని ప్రజాస్వామ్యమే లక్ష్యంగా జ్వాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకరి ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రతీ యేడాది అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని వినూత్న రీతిలో నిర్వహించి.. అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు.అవినీతిపరులారా తస్మాత్ జాగ్రత్త..లేదంటే అంతేఇందులో భాగంగానే నేడు అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాలా సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అవినీతిపరుడికి సన్మాన యాత్ర పేరుతో గురువారం హనుమకొండలో గాడిదపై ఊరేగింపు నిర్వహించారు. హనుమకొండ వేయిస్థంభాల ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు గాడిదపై సాగిన అవినీతిపరుడికి సన్మాన యాత్ర నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. నడి రోడ్డుపైనే ఓ వ్యక్తికి అరగుండు గీసి, సగం మీసం తీసేసి మెడలో చెప్పుల దండ వేసి గాదిపై కూర్చోబెట్టి ఊరేగించారు.

ఈ ఊరేగింపులో అవినీతిపరులారా జాగ్రత్త.. అవినీతికి పాల్పడితే మీకూ ఇదే గతి పడుతుందంటూ స్లోగన్స్ తో హెచ్చరించారు. జ్వాల, లోక్ స‌త్తా సంస్థ సంయుక్తంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో యువ‌త పెద్దఎత్తున పాల్గొని అవినీతి వ్య‌తిరేక నినాదాలు చేశారు.

రాజుల కాలంలో త‌ప్పులు చేసిన వారికి ఇలా గాడిద‌మీద అర‌గుండ‌, అర‌మీసం తీసి ఊరేగించేవార‌ని, త‌ర్వాత గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేసేవార‌ని జ్వాలా సంస్థ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు సుంక‌రి ప్ర‌శాంత్ గుర్తు చేశారు. ఈ శిక్ష‌తో వారిలో మార్పు వ‌చ్చేద‌ని, ఇత‌రుల్లోనూ భ‌యం క‌లిగేద‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో అవినీతి విచ్చ‌ల‌విడిగా పెరిగిపోయినందున ప్ర‌భుత్వం సైతం అవినీతిప‌రుల‌కు ఇలాంటి శిక్ష‌లే విధించాల‌న్న డిమాండ్ తో తాము ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించామ‌ని తెలిపారు.

డిసెంబ‌రు-9న అంత‌ర్జాతీయ అవినీతి వ్య‌తిరేక దినం సంద‌ర్భంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అధికారికంగా క‌నీసం ఒక్క కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించ‌క‌పోవ‌డం అత్యంత శోచ‌నీయ‌మని లోక్ స‌త్తా రాష్ట్ర కోఆర్డినేట‌ర్ ప్రొఫెస‌ర్ ప‌ర్చా కోదండ‌రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌జాధ‌నంతో పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వాలు అవినీతిప‌రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ్వాలా సంస్థ స‌భ్యులు బుర్రి కృష్ణ‌మూర్తి, బుద్దె సురేష్, కీత రాజు, సుంక‌రి రాజు, ప్ర‌కాష్, లోక్ స‌త్తా స‌భ్యులు కామిడి స‌తీష్ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్, ఎన్ సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.