బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ?

బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ?

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి పడడం లేదా అంటే ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తాజాగా నిర్వహించిన బీజేపీ బూత్ సమ్మేళనంలో ఇద్దరూ ఒకే సమయంలో ప్రసంగించడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ముదిరిన లొల్లి వల్లే ఇద్దరి ప్రసంగాలు ఒకే సమయంలో జరిగాయన్న గుసగుసలు బీజేపీలో వినిపిస్తున్నాయి.బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ?బీజేపీ బూత్ సమ్మేళనంలో బండి సంజయ్ ప్రసంగం మొదలైంది. బండి తన స్టైల్ లో ప్రసంగించడం మొదలుపెట్టారు. అయితే కారణమేంటో తెలియదు కానీ వరంగల్ ఈస్ట్ లో ఈటల రాజేందర్ ప్రసంగం స్టార్ట్ అయ్యింది. బండి స్పీచ్ 118 నియోజకవర్గాలకు వచ్చింది. కానీ వరంగల్ ఈస్ట్ లో రాలేదు. దీంతో ఈస్ట్ లో ఈటల ప్రసంగించారు. అయితే ఇద్దరూ ఒకేసారి ప్రసంగాలు చేయడం వెనక ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడకనే ఇలా జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఈటల ఇలా ఇదంతా చేశారన్న వాదన వినిపిస్తోంది.

బండి సంజయ్ ప్లేస్ లో ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారన్న ప్రచారం ఈ మధ్య జోరుగా సాగుతోంది. ఇక బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉందట. బండి కేంద్రమంత్రి అయితే.. ఆ స్థానంలో ఈటలను బీజేపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈటల బీసీ కావడం, సీఎం కేసీఆర్ పై ఉదృతంగా పోరాటం చేస్తుండడం, దీనికి తోడు హుజూరాబాద్ ఎన్నికల్లో విజయఢంకా మోగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సానుకూల వాతావరణం ఉంది. ఈటలకు సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. అధికారపార్టీకి ధీటుగా ఆర్థికంగానూ బలంగా ఉన్నాడాయన. అందుకే ఈటల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని..ఆయనను తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అమిత్ షా కూడా ఈటలను ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన ఉంది.

నిజానికి బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తారు తప్ప కొత్తగా చేరిన వారికి అంతగా కీరోల్ ఉండదు. కానీ ఈటల విషయంలో మినహాయింపు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈటలకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, ఆర్థిక-అంగ బలం. పైగా బీసీ…. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలే. ఎందుకంటే ఇటీవల గత రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన సీనియర్ నాయకులకు బీజేపీ పెద్దపీట వేసింది. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందింది. తెలంగాణలోనూ అలా పాగావేసి, విజయఢంకా మోగించేందుకు బీజేపీ స్కెచ్ వేసుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది.

బీజేపీ శ్రేణులు బండి, ఈటల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెబుతున్నప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని… అందుకే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న వాదన బలంగా విపిసిస్తోంది. బీజేపీ బూత్ సమ్మేళనమే అందుకు ఉదాహరణ అన్న ప్రచారం జరుగుతోంది.