ఎర్రబెల్లిపై బీజేపీ ఫోకస్!! 

ఎర్రబెల్లిపై బీజేపీ ఫోకస్!!

ఎర్రబెల్లిపై బీజేపీ ఫోకస్!! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 20 మందిని మార్చాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఓరుగల్లు రాజకీయంలో ఒక్కసారిగా ఎర్రబెల్లి హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఎందుకీ వ్యాఖ్యలు చేశారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎర్రబెల్లి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్దల నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ గా ఉండి బహిరంగ వేదికలపై అలా మాట్లాడాల్సింది కాదని చెప్పారట. ఎన్నికల ముంగిట ఇలాంటి కామెంట్స్ తో పార్టీని ఇబ్బంది పెట్టవద్దని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. దీనికి ఎర్రబెల్లి హర్ట్ అయినట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి.

* బీఆర్ఎస్ మంచి కోసమే ఎర్రబెల్లి అలా మాట్లాడినట్లు సమాచారం..
బీఆర్ఎస్ మంచి కోసమే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని తాను మాట్లాడానని ఎర్రబెల్లి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. తన వ్యాఖ్యల వెనుక మరో ఉద్దేశ్యం లేదని కూడా ఆయన చెబుతున్నారట. సరిగ్గా ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ఆలోచిస్తోందని టాక్. ఎర్రబెల్లి వ్యాఖ్యలు, ఆ తర్వాత పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో కమలం పార్టీ ఉందని తెలుస్తోంది. అందుకే ఎర్రబెల్లిని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ను ఆయనపై ప్రయోగించేందుకు ప్లాన్ జరుగుతోందని సమాచారం. ఈటెల రాజేందర్ ద్వారా ఈ ప్లాన్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈటెల చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారట.

*ఈటెల మంత్రం ఫలిస్తుందా..
ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సీనియర్ లీడర్. ప్రస్తుతం పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. పార్టీలకతీతంగా ఎర్రబెల్లికి చాలా మంది నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. జిల్లా అంతటా ప్రభావం చూపే బలం ఎర్రబెల్లికి ఉంది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లిని బీజేపీలోకి తీసుకొస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాగా కలిసి వస్తుందని ఈటెల భావిస్తున్నారట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు ఈటెల వివరించినట్లు టాక్. ఎర్రబెల్లి ప్రొఫైల్ ను హైకమాండ్ కు ఈటెల చూపించారని.. దానికి కమలం పెద్దలు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఎర్రబెల్లిని బీజేపీలోకి తీసుకురావాలని ఈటెలకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.

* ఎర్రబెల్లి బీఆర్ఎస్ ను వీడటం అంత ఈజీ కాదేమో..
హైకమాండ్ సూచనతో ఈటెల దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావుతో ఈటెల మాట్లాడినట్లు సమాచారం. ప్రదీప్ రావు ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. అయితే ప్రదీప్ రావు మాత్రం తన సోదరుడు బీఆర్ఎస్ ను వీడకపోవచ్చని చెప్పారట. తాను మధ్యవర్తిత్వం వహించడం కంటే ఈటెల స్వయంగా ఎర్రబెల్లిని సంప్రదించడం బెటర్ అని సూచించినట్లు టాక్. ఈ ప్రతిపాదనకు ఈటెల కూడా ఓకే అన్నట్లు తెలిసింది. త్వరలోనే ఎర్రబెల్లితో ఈటెల కాంటాక్ట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఒకవేళ ఈటెల కలిసినా బీఆర్ఎస్ ను వీడేందుకు ఎర్రబెల్లి అంత ఈజీగా ఒప్పుకుంటారా? బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతారా? అన్నది కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో…!!