బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాస్టర్ ప్లాన్ టెన్షన్ !! 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాస్టర్ ప్లాన్ టెన్షన్ !!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాస్టర్ ప్లాన్ టెన్షన్ !! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : మాస్టర్ ప్లాన్.ఈ పేరు వింటేనే బీఆర్ఎస్ లో గుబులు రేగుతోంది. ఎందుకంటే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం చేసిన రచ్చ రచ్చ అంతా ఇంతా కాదు. మాస్టర్ ప్లాన్ లో భూమి పోతుందన్న భయంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఆ తర్వాత రైతుల ఆందోళనతో కామారెడ్డి అట్టుడికింది. ప్రతిపక్షాల మద్దతుతో రైతులు పోరుబాట పట్టారు. చివరకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దయ్యింది.

అటు జగిత్యాలలోనూ మాస్టర్ ప్లాన్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెడకు చుట్టుకుంది. రైతులు ఏకంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను నిలదీసే పరిస్థితి వచ్చింది. చివరకు వాస్తవం బోధపడింది. ప్రభుత్వం జగిత్యాల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. జగిత్యాలలోనూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేశారు.

ఇప్పుడు నిర్మల్ వంతు వచ్చింది. నిర్మల్ లోనూ మాస్టర్ ప్లాన్ అంశం చిచ్చురేపింది. భూములు పోతాయన్న భయంతో స్థానికులు, రైతుల్లో కలవరం మొదలైంది. దీనిపై అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇలాకా కావడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం భూయజమానులు గళమెత్తారు. వెంటనే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకపోతే కామారెడ్డి, జగిత్యాల కంటే ఎక్కువ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

*మాస్టర్ ప్లాన్ వర్కౌట్ కానట్లేనా..
ఇలా కామారెడ్డి, జగిత్యాల, ఇప్పుడు నిర్మల్ లోనూ మాస్టర్ ప్లాన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. ఆగమేఘాల మీద నిర్మల్ అధికారులతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడినట్లు తెలుస్తోంది. వెంటనే ఈ ప్రతిపాదనను పక్కనబెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. కామారెడ్డి, జగిత్యాల ఘటనలు మరువకముందే మాస్టర్ ప్లాన్ పై ఎందుకు తొందరపడుతున్నారని కూడా సీరియస్ అయినట్లు టాక్.

అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడా ప్రస్తుతానికి మాస్టర్ ప్లాన్ పై ఫోకస్ పెట్టొద్దని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముంగిట ఈ మాస్టర్ ప్లాన్ తో లాభం కంటే నష్టం జరిగే ప్రమాదముందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే మంత్రి కేటీఆర్ తో మొర పెట్టుకున్నారట.

* దూకుడు వద్దు..
తెలంగాణలో అసలే బీజేపీ దూకుడు మీదుంది. మాణిక్ రావు ఠాక్రే రాకతో తెలంగాణ కాంగ్రెస్ లోనూ స్పీడ్ పెరిగింది.ఈ తరుణంలో మాస్టర్ ప్లాన్ ను ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకునే ప్రమాదముందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు భయపడుతున్నారట.కామారెడ్డి తరహా సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో ఎక్కడా మాస్టర్ ప్లాన్ అంశాన్నే తెరపైకి తీసుకురావొద్దని ప్రభుత్వ పెద్దలకు వివరించినట్లు సమాచారం.

దీంతో రాష్ట్రంలో ఎక్కడా మాస్టర్ ప్లాన్ పై దూకుడుగా వెళ్లొద్దని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడా మాస్టర్ ప్లాన్ పై తొందరపడొద్దని కూడా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా కూడా మాస్టర్ ప్లాన్ తెరపైకి వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు.