రైలుపట్టాలపై నాటుబాంబు పేలుడు

రైలుపట్టాలపై నాటుబాంబు పేలుడురేణికుంట: చిత్తూరు జిల్లా రేణికుంట పరిధి తారకరామనగర్ లోని రేణికుంట-కడప మార్గంలో రైలు పట్టాలపై నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేణికుంట రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు కాస్తున్న శశికళ అనే మహిళ ఓ డబ్బాను గుర్తించింది. వెంటనే తన చేతిలో వున్న కర్రతో డబ్బాను కదిలించడంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన మహిళను 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ , రేణుగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే అక్కడ అడవి పందుల కోసం గతంలో నాటు బాంబులు పెట్టారని స్థానికులు తెల్పిన సమాచారంతో పాటు ఇతరత్రా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు రేణిగుంట సీఐ అంజు యాదవ్ తెలిపారు.