రావత్ దంపతులకు ప్రముఖుల నివాళులు

రావత్ దంపతులకు ప్రముఖుల నివాళులుఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక భౌతికకాయాలను ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు.

రావత్ దంపతులకు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అవిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రావత్ దంపతులకు పుష్పాంజలి ఘటించారు. కణిమొళి, గవర్నర్ తమిళసై సౌందర రాజన్, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోడీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, హరీశ్ రావత్, ఢిల్లీ లెఫ్లినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తదితరులు అంజలి ఘటించారు.

లిద్దర్ భౌతిక కాయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి , ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులు అంజలి ఘటించారు.

సీడీఎస్ రావత్ దంపతులకు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు సైనిక సిబ్బంది నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్ లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి గోర్ఖా రైఫిల్స్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.