సాయితేజ కుటుంబానికి మంచు వారి భరోసా

సాయితేజ కుటుంబానికి మంచు వారి భరోసాహైదరాబాద్:  తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య, వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ వీరమరణం పొందారు.

సాయితేజ ఆకస్మిక మృతి ఆయన కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. అమర జవాన్ సాయితేజకు 5యేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, 2 యేళ్ల కూతురు దర్శిని ఉన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో ఆయన తన కుటుంబాన్ని స్వగ్రామం నుంచి మదనపల్లెకి మార్చారు.

సాయితేజ మరణంతో పలువురు ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పుకొస్తున్నారు. తాజాగా సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సాయి తేజ భార్య శ్యామలతో ఫోన్లో మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జవాన్ పిల్లలకు ఇంజనీరింగ్ వరకు చదువు చెప్పించే బాధ్యత తనదని మాటిచ్చారు. విష్ణు సూచన మేరకు సంస్థ ప్రతినిధులు లాన్స్ నాయక్ సాయితేజ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంజనీరింగ్ వరకు తమ విద్యాసంస్థలోనే ఉచితంగా చదివిస్తామని చెప్పారు.

సాయితేజ కుటుంబాన్ని త్వరలోనే కలువనున్నట్లు మంచు విష్ణు చెప్పారు. అమర జవాన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని విష్ణు తెలిపారు.