మోడీ సర్కారుకు మూడింది : దాస్యం

మోడీ సర్కారుకు మూడింది : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రంలో బీజేపీ సర్కారుకు మూడిందని, దేశవ్యాప్తంగా సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో తెలంగాణ రైతాంగం భగ్గుమన్నది. ఇందులో భాగంగానే తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ నగరంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో గురువారం రైతులు నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.మోడీ సర్కారుకు మూడింది : దాస్యంఅధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. తెలంగాణ రైతుల నిరసన సెగ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తగలాలని పిలుపునిచ్చారు. రేపు ప్రతీ రైతు తమ ఇంటిపై నల్లజెండా పెట్టి కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలించాలని దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు.

వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఉద్యమ నాయకులు కేసీఆర్ సారథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. వడ్లు కొనేదాక తమ కొట్లాడ ఆగదని, ఢిల్లీపై దండయాత్రకు పెద్ద సంఖ్యలో కదిలివస్తామని హెచ్చరించారు. వన్ నేషన్..వన్ రేషన్ పాలసీని తెలంగాణ వడ్లు కొనడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని నగర మేయర్ గుండు సుధారాణి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలను నూకలు తినాలని అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనేలా ఒప్పిస్తామని ఉత్తర ప్రగల్భాలు మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వారు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనేలా చెయ్యాలని వారు హెచ్చరించారు.మోడీ సర్కారుకు మూడింది : దాస్యంఅంతకు ముందు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్క్ నుంచి హయగ్రీవ చారి గ్రౌండ్ వద్దకు ఎడ్ల బండ్లతో ర్యాలీగా బయల్దేరి, రైతు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు, డీసీసీ చైర్మన్ మార్నేని రవిందర్, టీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళాకారుల ఆట పాటలతో పాటు, తెలంగాణ ప్రజలపై, రైతులపై బీజేపీ ప్రభుత్వం , బీజేపీ ప్రజాప్రతినిధులు చూపుతున్న వివక్షతను ధర్నా వేదికగా రైతులకు వివరించారు.