మరో మైలురాయికి చేరువలో విరాట్​ కోహ్లి

మరో మైలురాయికి చేరువలో విరాట్​ కోహ్లికాన్‌బెర్రా : మ‌రో అరుదైన మైలురాయికి చేరువలో టీమీండియా కెప్టెన్ విరాట్​ కోహ్లి ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరగబోయే మూడో వన్డేలో విరాట్​ ఈ రికార్డు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరాట్ మ‌రో 23 ప‌రుగులు చేస్తే చాలు.. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగుల మైల్‌స్టోన్ అందుకున్న ప్లేయ‌ర్‌గా నిల్వనున్నారు. ఈ క్ర‌మంలో అత‌డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ రికార్డును అధిగ‌మించినవాడవుతాడు. ఒక‌వేళ మూడో వ‌న్డేలోనే కోహ్లి ఈ 23 ప‌రుగులు చేస్తే.. త‌న 251వ వ‌న్డే, 242వ ఇన్నింగ్స్‌లోనే 12 వేల ప‌రుగుల మైలురాయిని అందుకోనున్నారు. సచిన్​ టెండూల్క‌ర్ ఈ ఘ‌న‌త‌ను అందుకోవ‌డానికి 309 మ్యాచ్‌లు, 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఈ లెక్క‌న సచిన్​ కంటే ఎంతో ముందుగానే విరాట్ ఈ మార్క్‌ అందుకోనున్నాడు. ఓవ‌రాల్‌గా చూసుకుంటే వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు చేసిన వాళ్ల‌లో కోహ్లి ఆరో ప్లేయ‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. ఇంత‌కు ముందు స‌చిన్‌తోపాటు రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్క‌ర‌, స‌నత్ జ‌య‌సూర్య‌, మ‌హేల జ‌య‌వ‌ర్దనె కూడా వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేస్తే.. ఆస్ట్రేలియాపై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఇండియ‌న్ బ్యాట్స్‌మ‌న్‌గా స‌చిన్ (9 సెంచ‌రీలు) స‌ర‌స‌న నిలుస్తాడు.