పాడిరంగం అభివృద్ధికి కృషి

పాడిరంగం అభివృద్ధికి కృషివిజయవాడ : లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న పాడిరంగం సీఎం కేసీఆర్​ సహకారంతో అభివృద్ధి పథంలో పయనిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. శనివారం విజయవాడలోని గేట్​వే హోటల్​లో తెలంగాణ విజయడెయిరీ ఉత్పత్తులను విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాన్ని ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముఖ్యమంత్రి తోడ్పాటుతో విజయ డెయిరీ లాభాల పట్టిందని పేర్కొన్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 1962 అంబులెన్స్ ల ద్వారా జీవాల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం కొనియాడారు. విజయ డెయిరీ ఉత్పత్తులు నాణ్యత విషయంలో ఎంతో ప్రజాదరణ పొందాయన్నారు. గత పాలకుల స్వప్రయోజనాల కారణంగా ఈ రంగం కొంత నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ అభివృద్ధి సాధించిన విధానాన్ని కళాకారులు తమ ప్రదర్శన వివరించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.