రేపు కేటీఆర్ వరంగల్ పర్యటన.. ఘనంగా ఏర్పాట్లు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఏప్రిల్ 20, బుధవారం రోజున టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. కేటీఆర్ వరంగల్ మహానగర పర్యటన సందర్భంగా మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుదీర్ కుమార్, రాష్ట్ర వికలాంగుల సహకరా సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, అరూరి రమేశ్, ఒడితెల సతీశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులతో కలిసి నక్కలగుట్టలోని హరిత కాకతీయలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. అనంతరం వీరందరితో కలిసి వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న ప్రదేశాలను సందర్శించారు. ఆయా పనులను పరిశీలించారు. ముందుగా హనుమకొండ హయగ్రీవాచారి కాంపౌండ్ లో జరుగనున్న పార్టీ ప్రతినిధుల సభా ప్రాంగణాన్ని వారు పరిశీలించారు.
అక్కడి నుంచి జీడబ్ల్యూఎంసీ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలలించారు. అనంతరం నర్సంపేటలో జరిగే కార్యక్రమాల స్థలాలు మున్సిపాలిటీ, మెఘా పీఎన్ జీ ప్లాంట్ , సభా ప్రాంగణం, హెలీ ప్యాడ్ లను పరిశీలించారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులుగా దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్ లు కేటీఆర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.