ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం : కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి సర్వం సన్నద్ధమైంది. 2021 నవంబర్ లో ఇదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్లీనరీ జరుగగా, తిరిగి 6 నెలల వ్యవధిలో పార్టీ 21వ ఆవిర్భావ వేడుకులకు మరోసారి వేదిక కాబోతున్నది. బుధవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఐటీ ప్రాంతం హెచ్ఐసీసీ ప్రస్తుతం వేదికైంది.హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలతో సహా, ఇతర వస్తు సామాగ్రి, తిను బండారాలపై ధరల పిడుగులు వేసి, వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన తరుణంలో.. కేంద్రంపై పోరుకు 11 కీలక తీర్మానాలను ఆవిర్భావ వేదిక ఆమోదించనున్నది.
పేదల గుండె చప్పుడుగా పార్టీ తీర్మానాలు ఉండబోతున్నాయని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిచిన అనంతరం ప్రకటించారు. బాల్య, కౌమార దశను దాటుకుని మేజర్ గా పరిణమించి టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలను పూర్తి చేసుకున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వేడుకలకు సంబంధించి హెచ్ఐసీసీలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారని అన్నారు.
3500 మందికి అనుమతి.. తిలకించేందుకు 10 భారీ స్క్రీన్లు..
హెచ్ఐసీసీలో బుధవారం జరుగనున్న 21వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 3500 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ఇందులో 500 నుంచి 1000 మంది వరకు మహిళలు హాజరుకానున్నారు. 300 మంది మీడియా ప్రతినిధులను సభలోకి అనుమతించబోతున్నామని అన్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పార్టీ ముందస్తుగా ప్రత్యేక పాసులను జారీ చేసిందన్నారు. తద్వారా ఈ పాస్ లు ఉన్నవారు మాత్రమే సభకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్ వేదిక ద్వారా కోరారు.
సభకు రాలేని పార్టీ ప్రతినిధులంతా తమ పరిధిలోని ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతీ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు. అయితే ప్రత్యక్షంగా 3500 మంది మాత్రమే వేదిక ద్వారా వేడుకలను ప్రత్యక్షంగా తిలకించినా, మరో 8వేల మంది వేడుక విశేషాలను తిలకించేందుకు హైటెక్స్ ప్రాంగణంలో 10 వరకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భోజనాలను సైతం 12వేల మంది వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
10 అంశాలతో కూడిన బ్యాగ్ కిట్..
రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరుకానుండటంతో వారి పేర్ల నమోదు, పార్టీ తరపున కిట్లను అందించేందుకు గాను జిల్లాల వారీగా 33 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా పాస్ స్కాన్ అనంతరం వేదికలోకి వెళ్లే పార్టీ శ్రేణులతో ప్రత్యేక బ్యాగ్, తీర్మానాల పుస్తకం, స్నాక్స్, పెన్ను, మాస్కు, సానిటైజర్, పార్టీ జెండా , పార్టీ కండువా సహా మొత్తం 10 అంశాలతో ఉన్న బ్యాగ్ ను పార్టీ శ్రేణులకు కౌంటర్లలో అందించనున్నారు. వేడుకలకు హాజరైన ఆహ్వానితులందరికీ ఈ బ్యాగ్ కిట్లను అందించనున్నట్లు కమిటీ ప్రతినిధులు చెప్పారు.
14 యేండ్ల పార్టీ ప్రస్థానంపై ఫోటో ప్రదర్శన..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి స్వరాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో 14 యేండ్ల పాటు కొనసాగిన ఉద్యమ పంథాను కళ్లకు కట్టేలా వేదిక సమీపంలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మొత్తం 1500 ఫోటోల ద్వారా 14 యేండ్ల పార్టీ ప్రస్థానం, స్వరాష్ట్ర సాధన అనంతరం 2 దఫాలుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన స్వపరిపాలన, ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 34 ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకునేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 3 ప్రత్యేక వాల్స్ ఏర్పాటు చేసి, ఓ వాల్ పై 14 యేండ్ల పార్టీ ప్రస్థానం, రెండో వాల్ పై దేశ రాజధానిలో సీఎం కేసీఆర్ కేంద్రంపై కొనసాగించిన పోరు, మూడో వాల్ పై 34 సంక్షేమ పథకాల పేర్లను ప్రస్తావిస్తూ ఈ ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
కళాకారులచే ప్రదర్శనలు.. ప్రత్యేక ద్వారాలు..
సభా వేదికకు చేరుకునేందుకు సీఎంకు ప్రత్యేక ద్వారం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి వీఐపీలు చేరుకునేందుకు ప్రత్యేక ద్వారం , ప్రత్యేక ఆహ్వానితులు చేరుకునేందుకు ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు. సభా వేదికపై 200 మంది ప్రముఖులను ఆహ్వానించనున్నారు. వేదికపై సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన, పార్టీ జెండా ఆవిష్కరణ, తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించే ఏర్పాట్లు చేశారు.
సభా వేదికపై 80 ఫీట్ల భారీ డిజిటల్ స్క్రీన్ ను అమర్చారు. అందులో 35 ఫీట్ల మేర సంక్షేమ పథకాలపై ప్రచారం కాగా, మిగిలిన స్థలంలో వేదిక కార్యక్రమ లైవ్ ను అందించనున్నారు. సభా వేదికకు ఎడమవైపున 60 మంది కళాకారులు ఏక కాలంలో వేదికపై కళా ప్రదర్శనలు, పాటలు ఆలపించే వేదికను ఏర్పాటు చేశారు.
పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరుకానున్న ప్రత్యేక ఆహ్వానితులకు అందిస్తున్న పాస్ లు పూర్తిగా సాంకేతికమైనవి. కేవలం పాస్ లు ఉన్న వారినే ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్న 20 ప్రత్యేక కౌంటర్ల ద్వారా సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ముందస్తుగా వీరికి జారీ చేసిన పాస్ లను ప్రత్యేక కౌంటర్లలో స్కాన్ చేసిన మీదటే లోపలికి పంపుతారు. దేశ రాజకీయ చరిత్రలో తొలి సారిగా ఈ తరహా సాంకేతిక పాస్ ల ద్వారా ఆహుతులను సభలోకి అనుమతించబోతున్నారు. వీటి ద్వారా పాస్ లు పొందిన వారు కాకుండా మరొకరు వేదికకు చేరుకోలేరు. ఈ తరహా సాంకేతికను అమలు చేయబోతున్న పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతున్నది.