ప్రముఖ హాస్యనటుడు ఆర్.మయిల్‌స్వామి మృతి
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : సినీ నటుడు తారకరత్న తుది శ్వాస విడిచి గంటలు కూడా గడవక ముందే దక్షిణాది సినీ పరిశ్రమను మరో విషాదం శోకసంద్రంలో ముంచేసింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు ఆర్.మయిల్‌స్వామి (57) అనారోగ్యంతో ఆదివారం ఉదయం (ఫిబ్రవరి 19న) కన్నుమూశారు. ఆరోగ్యపరంగా శనివారం ఆయన కాస్త ఇబ్బంది పడటంతో పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి మయిల్‌స్వామిని కుటుంబ సభ్యులు తరలించారు.
ఆదివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారు. ఆయన కేవలం సినిమాల్లో మాత్రమే కాదు స్టాండప్ కమెడియన్‌గా, టీవీ హోస్ట్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా సుపరిచితులు. తమిళనాడు ప్రజల్లో ఈయన ఎవరో తెలియని వారు దాదాపుగా ఉండరు.
1984లో కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ధవాని కమవుగల్ సినిమాతో మయిల్ స్వామి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన చివరి సినిమా ‘గ్లాస్‌మేట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గ్లాస్‌మేట్’ సినిమా కోసం డబ్బింగ్ చెప్పిన వీడియోను ఆయన చివరి వీడియోగా చెబుతున్నారు. మయిల్‌కు సంతాపం తెలుపుతూ అభిమానులు ట్వీట్స్ చేయడంతో ఆయన పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. తమిళ సినీ నటుడు విక్రమ్ మయిల్‌స్వామి మృతిపై ట్వీట్ చేశారు. దర్శకుడు భారతీరాజా, రాధికా శరత్‌కుమార్, ఆర్.శరత్ కుమార్ మయిల్ స్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని సంతాపం తెలిపారు.
తెలుగు సినీ నటుడు తారకరత్న మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనై 24 గంటలు కూడా గడవక ముందే ఆర్.మయిల్‌స్వామి చనిపోవడం దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలకు కారణమైంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్ ఛానల్ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే.