తెలంగాణలో నేటి నుంచి ఫీవర్ సర్వే

తెలంగాణలో నేటి నుంచి ఫీవర్ సర్వేహైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా నేటి నుంచి ఫీవర్ సర్వే ప్రారంభంకానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో రాష్ట్రంలో మూడోసారి ఫీవర్ సర్వే చేయనున్నారు. నేటి నుంచి జరిగే ఫీవర్ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కోటి ఐసోలేషన్ కిట్ లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 4,207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయనున్నారు.

ఇంటింటి సర్వేలో ఎవరికైనా జ్వరంతో పాటు ఇతర లక్షనాలు ఉంటే అక్కడే అవసరం అయిన మందులు ఇస్తారు. ఈ ఫీవర్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర వహించనున్నారు. ఫీవర్ సర్వే కోసం 25 వేల మందికి పైగా ఏఎన్ఎంలతో పాటు 7 వేలకు పైగా ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండనున్నారు. ఫీవర్ సర్వే కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ ఫీవర్ సర్వే కోసం మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది కూడా సహకరించాలని మంత్రి హరీష్ రావు కోరారు.