దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు

దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం రాత్రి హోలికా దహనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత హోలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ప్రతీ రంగు ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. మీ అందరికి హోలీ శుభాకాంక్షలు , పరస్పర ప్రేమ, ఆప్యాయత మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పంగుడ మీ జీవితంలో ఆనందన్ని తీసుకురావాలని ప్రధాని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ లు రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలుఅమృత్ సర్ లో భారత జవాన్లు హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ప్రతీ ఒక్కరి జీవితాలు కూడా హోలీ పండుగలాగా కలర్ ఫుల్ గా ఉండాలని జవాన్లు కోరారు. సామాన్య ప్రజానీకంతో పాటు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాల్లో సంబురంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పలువురు మంత్రులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఇందిరాపార్కు వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. స్థానికులు, కార్యకర్తలతో కలిసి రంగులు పూసుకున్నారు. అనంతరం అందరితో కలిసి స్టెప్పులు వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యూత్ లో జోష్ నింపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో హోలీ సందర్భంగా కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రి ఎర్రబెల్లి వెళ్తూ మార్గం మధ్యలో మహిళలతో కోలాటం ఆడారు. అలాగే వారితో కలిసి డ్యాన్స్ చేశారు.

హోలీ పండుగ సందర్భంగా కే.వి. ప్రొడక్షన్స్ & ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో హనుమకొండలో “అరేయ్ మావ హోలీ రా” పేరుతో నిర్వహించిన హోలీ సంబరాలలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతీ యువకులతో కలిసి హోలీ సంబరాలలో పాల్గొన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. ప్రెస్ క్లబ్ ఆవరణలో రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.