వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్హనుమకొండ జిల్లా : ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పీజీఆర్ అపార్ట్ మెంట్ తో పాటు పోలీస్ కమిషనరేట్ మరియు దేశంలో వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు చోరీ సొత్తును , కొనుగోలు చేసిన ఒక నిందితుడిని కాజీపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ముఠాను, చోరీ చేసిన సొత్తును వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ చేసిన తీరును, చోరీకి పాల్పడిన విధానాన్ని సీపీ మీడియాకు వివరించారు.

అరెస్ట్ చేసిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల నుంచి పోలీసులు 404 గ్రాముల బంగారం, మూడు ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు, 9వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ముఠాలోని ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన ముఠా సభ్యులతో పాటు పరారీలో ఉన్న ముఠా సభ్యులందరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో నిందితులంరు ఒక ముఠాగా ఏర్పడ్డారని పేర్కొన్నారు.

వీరంతా పలు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో చోరీకి అనువుగా ఉన్న ఇండ్లను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడేవారని తెలిపారు. ఈ విధంగా దోచుకున్న సొమ్మును తిరిగి వచ్చిన తర్వాత తమ ప్రాంతంలోని వ్యాపారస్థులకు అమ్మి సొమ్ము చేసుకుని, వాటాల వారిగా పంచుకొనేవారని అన్నారు.

గతంలో చోరీకి పాల్పడటంతో పెద్ద మొత్తంలో బంగారం దొరకడంతో నిందితులు చోరీని అలవాటుగా మార్చుకున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 26న కాజీపేటలోని పీజీఆర్ అపార్ట్మెంట్ లో నలుగురు నిందితులు చోరీకి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అర్థరాత్రి మారుతి నగర్ లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న టూ వీలర్ ను దొంగిలించారు. అనంతరం పీజీఆర్ అపార్ట్మెంట్ లో దొంగతనానికి స్కెచ్ వేశారు.

స్కెచ్ లో భాగంగానే అపార్ట్మెంట్ లో దూరి, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చొరబడి విలువైన సొత్తును కాజేసి అదే టూ వీలర్ పై హైదరాబాద్ బయల్దేరారు. మార్గం మధ్యలో రాంపూర్ వద్ద బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో అటుపక్కన వున్న చెట్ల పొదల్లో పడేశారు. తిరిగి హైదరాబాద్ మీదుగా మధ్యప్రదేశ్ చేరుకుని మిగతా నిందితుల సాయంతో చోరీ సొత్తును నగదుగా మార్చుకున్నట్లు సీపీ తెలిపారు.

గతంలో పెద్ద మొత్తంలో బంగారం దొరకడంతో నిందితులు మరోసారి కాజీపేట ప్రాంతంలో చోరీ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారంతో కాజీపేట పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుల కదలికలపై దర్యాప్తు బృందాలు నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు గతంలో 11 చోరీలకు పాల్పడినట్లు తెలిపరాు. ఇందులో కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ, మిగతావి ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ బృందన్ని సీపీ అభినందించారు.