జగిత్యాలలో వేడెక్కిన రాజకీయం!!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ రద్దయినప్పటికీ రాజకీయవేడి మాత్రం ఇంకా చల్లారలేదు. తాజాగా మరింతగా రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు.పేరుకే తాను మున్సిపల్ చైర్ పర్సన్ అని,పెత్తనమంతా ఎమ్మెల్యేదేనని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు.బడుగు,బలహీన వర్గానికి చెందిన తనపై సంజయ్ కక్ష గట్టారని ఆమె ఆరోపించారు.ఇక సాలు దొర అంటూ సంజయ్ తీరును ఎండగట్టిన శ్రావణి ఆపై రాజీనామా ప్రకటించారు.
*విద్యావంతురాలికి సామాజిక వర్గమే శాపమైందా!
మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య కొంతకాలంగా ఎడముఖం..పెడముఖం అన్నట్లుగా ఉంది. దీని వెనక కారణాలు చాలానే ఉన్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి తనను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కు చాలాకాలం క్రితమే డౌట్ వచ్చిందట. అప్పటి నుంచే ఇద్దరి మధ్య వార్ మొదలైందని టాక్. శ్రావణి విద్యావంతురాలు,బాగా మాట్లాడగలదు.పైగా బడుగు బలహీనవర్గాలకు చెందిన సామాజికవర్గం.ఇదంతా బాగానే ఉంది. ఇవే ఆమెకు మైనస్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరయినప్పటికీ,చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడిందే హైలైట్ అయ్యేదట.ఇలా ఉంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని ఎమ్మెల్యే సంజయ్ భావించారని టాక్. అందుకే ఆమెను ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నం చేసే వారన్న వాదన ఉంది. సంజయ్ కి తెలియకుండా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి జగిత్యాలలో ఏ చిన్న పని కూడా చేయకూడదట. ఒకవేళ చేయాలని చూస్తే అధికారులు కూడా సహకరించే వారు కాదని సమాచారం.
*అవిశ్వాసం వెనుక ఆయనే ఉన్నారా!
శ్రావణి రాజకీయంగా మరింత ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చాలాకాలంగా అనుమానాలున్నాయి. అందుకే ఆమెకు చెక్ పెట్టేందుకు సంజయ్ బాగానే ప్రయత్నాలు చేసినట్లు టాక్. ఇటీవల జరిగిన అవిశ్వాసం డ్రామా వెనుక కూడా ఆయనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లను అడ్డం పెట్టుకుని, శ్రావణి పదవికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి కౌంటరిచ్చేందుకు శ్రావణి కూడా కొన్ని ప్రయత్నాలు చేశారని సంజయ్ వర్గం భావిస్తోంది.
మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ కొంతమంది రైతులు, స్థానికులు ఎమ్మెల్యే సంజయ్ ఇంటి ముందు ఇటీవల ధర్నా చేపట్టారు. దీని వెనుక శ్రావణి ఉన్నారని సంజయ్ కి అనుమానం వచ్చిందట. దీంతో ఇద్దరి మధ్య వాతావరణం మరింత చెడిపోయిందని ప్రచారం జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తన ఇంటి దగ్గర ధర్నా చేయడంపై ఎమ్మెల్యే సంజయ్ కి విపరీతమైన కోపం వచ్చిందట.
మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి ఇదంతా చేయిస్తున్నారని ఎమ్మెల్యే వర్గానికి డౌటొచ్చింది. దీంతో మాస్టర్ ప్లాన్ రద్దుపై చర్చల్లో శ్రావణిని ఎక్కడా పిలవలేదట. ఆమెకు తెలియకుండానే సంజయ్ అన్నీ తానై నడిపించారట. కేవలం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రకటన వరకే శ్రావణి ప్రమేయం ఉందని టాక్. దీంతో శ్రావణి బాగా హర్ట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
*తాడో పేడో తేల్చుకుందామనే సిద్ధమైన శ్రావణి
ప్రతీ అంశంలోనూ ఎమ్మెల్యే సంజయ్ జోక్యం పెరిగిపోవడం, అవిశ్వాసం డ్రామాతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకే శ్రావణి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె బీఆర్ఎస్ కు మాత్రం రాజీనామా చేయలేదు. మున్సిపల్ చైర్ పర్సన్ గా తప్పుకోవడంతో ఇతర పార్టీల వారు శ్రావణిని కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి ఆమెకు ఆహ్వానం ఉందని టాక్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికే శ్రావణితో మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నుంచి కూడా ఆమెకు ఫోన్ వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.
అయితే అనవసరంగా తొందరపడొద్దని బీఆర్ఎస్ పెద్దలు శ్రావణికి నచ్చజెప్పినట్లు టాక్. ఎమ్మెల్సీ కవిత నుంచి కూడా ఆమెకు కబురు వచ్చిందని సమాచారం. మరి శ్రావణి హైకమాండ్ మాట వింటారా? అధిష్టానానికి కట్టుబడి ఉంటారా? బీఆర్ఎస్ లోనే ఉంటారా? లేక ఇతర పార్టీల్లోకి జంప్ కొట్టి, సంజయ్ కు షాకిస్తారా? అన్నది చూడాలి.