హాట్ సీట్ గా మారిన రాజేంద్రనగర్!!

హాట్ సీట్ గా మారిన రాజేంద్రనగర్!!

హాట్ సీట్ గా మారిన రాజేంద్రనగర్!!

వరంగల్ టైమ్స్ , టాప్ స్టోరి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఒకప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో భాగంగా ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో రాజేంద్రనగర్ కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో అప్పటిదాకా ఇక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డి లొకేషన్ ఛేంజ్ చేశారు. రాజేంద్రనగర్ నుంచి పోటీచేసే అవకాశం ఉన్నప్పటికీ మహేశ్వరం నియోజకవర్గానికి మారారు.

హాట్ సీట్ గా మారిన రాజేంద్రనగర్!!

*వ్యతిరేకత, వయోభారంతో పనిలేదు..
దాంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లోనూ టీడీపీ నుంచి మరోసారి విజయలక్ష్మి ఆయననే వరించింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరిన ప్రకాశ్ గౌడ్ 2018లో మరోసారి పోటీ చేశారు. వరుసగా మూడోసారి కూడా విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడుసార్లు ఆయనే గెలవడం, దాని వల్ల ఆయనపై ఉండే వ్యతిరేకత, వయోభారం దృష్ట్యా రాజేంద్రనగర్ నుంచి ఈసారి కొత్త నేత ఎమ్మెల్యే కావొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

*ఎంఐఎం ఓటు బ్యాంకు ఎక్కువే..
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు జోరు పెంచడం, ఎంఐఎం ఓటు బ్యాంకు కూడా బలంగా ఉండడంతో ఈసారి బీఆర్ఎస్ టికెట్ వేరేవాళ్లకు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రకాశ్ గౌడ్ ను గులాబీపార్టీ పక్కనబెట్టొచ్చన్న టాక్ వస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, యువనేత కార్తీక్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు ఎమ్మెల్యే టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ బలంగా మారడంతో సబిత చూపు రాజేంద్రనగర్ పై పడిందని టాక్. సబిత రేసులో ఉంటే రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం డమ్మీ అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది.

*సబితపై గౌరవంతోనే.. డమ్మీ ప్లాన్
రాజేంద్రనగర్ లో ఎంఐఎంకు బలమైన ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ సబితపై గౌరవంతో ఆ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ కుటుంబంతో సబిత కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకవేళ కార్తీక్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ వచ్చినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. బీఆర్ఎస్ తరపున ఒకవేళ సబితకు కానీ, కార్తీక్ రెడ్డికి కానీ టికెట్ వస్తే వారు గెలవడానికి మంచి అవకాశాలే ఉన్నాయని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అయితే ప్రకాశ్ గౌడ్ ను కాదని సబితకు టికెట్ ఇస్తారా అంటే చెప్పలేం. ఒకవేళ ప్రకాశ్ గౌడ్ కు టికెట్ ఇవ్వకపోతే ఆయన పార్టీ మారి పోటీచేసే అవకాశాలైతే ఉన్నాయి.

*నాన్ లోకల్ ఐతేనేం..ఎమ్మెల్యే టికెట్ నాకే అంటూ ధీమా..
ఇక రాజేంద్రనగర్ బీఆర్ఎస్ టికెట్ రేసులో వినిపిస్తున్న మరో పేరు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిది. నాన్ లోకల్ ఐనప్పటికీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిపై పోటీ చేసి ఎంపీగా గెలిచారు రంజిత్ రెడ్డి. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయనకు ఫాలోయింగ్ ఉంది. రాజేంద్రనగర్ లోనూ ఆయనకు అనుచరగణం ఎక్కువగా ఉంది.

ఈటెల రాజేందర్ పార్టీ మారిన తర్వాత రంజిత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ తో సాన్నిహిత్యం పెరిగిందని టాక్. అందుకే ఈసారి ఎంపీ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే రంజిత్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారట. కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తనకు బీఆర్ఎస్ టికెట్ ఖాయమని రంజిత్ రెడ్డి తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఎంపీ కంటే ఎమ్మెల్యే అయితేనే బెటర్ అనే ఆలోచనలో ఆయన ఉన్నారట.

రాజేంద్రనగర్ బీఆర్ఎస్ టికెట్ రేసులో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు తెరపైకి రావడంపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన ఆమధ్య ఒక ప్రకటన కూడా చేశారు. బీఆర్ఎస్ టికెట్ నాదే, గెలుపు కూడా నాదేనని స్పష్టం చేశారు. తాను పక్కా లోకల్ అని..రాజేంద్రనగర్ గడ్డ తన అడ్డా అని తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుందో? ఎవరి వెంట నిలవాలో? తెలియక రాజేంద్రనగర్ బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.

అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం టికెట్ పై ఎవరికీ హామీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. సబితకు గులాబీ టికెట్ వస్తుందా? లేక కార్తీక్ రెడ్డికి ఇస్తారా? లేక రంజిత్ రెడ్డికి బీఫామ్ ఇస్తారా? ఇవన్నీ కాదని మూడుసార్లు గెలిచిన ప్రకాశ్ గౌడ్ కే మరోసారి అవకాశం ఇస్తారా? అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఎవరికి ఇచ్చినా వేరే వాళ్లు సైలెంట్ గా ఉంటారా? అన్నది డౌటే. దీంతో టికెట్ ఎవరికి వచ్చినా సొంతపార్టీలోని అసమ్మతిని తట్టుకుని, ఆ తర్వాత ఇతర పార్టీల అభ్యర్థులతో తలపడాలి. ఇది మాత్రం పక్కా!!