మేడ్చల్ రేసులో ఈటెల? 

మేడ్చల్ రేసులో ఈటెల?

మేడ్చల్ రేసులో ఈటెల? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థికంగా ఆయన బలమైన నాయకుడు కావడంతో ఇతర పార్టీలు ఈసారి ధీటైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.

హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత బీజేపీలో ఈటెల కీలకంగా మారారు. మోదీ,అమిత్ షా దృష్టిలో పడ్డారు. పార్టీ పెద్దల దగ్గర ఆయనకు మంచి మార్కులే పడ్డాయి.అంతేకాదు బండి సంజయ్ ని మార్చి ఈటెలకు ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇవన్నీ పక్కనబెడితే ఈటెల రాజేందర్ కు మంచి బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నారు.పైగా ముదిరాజ్ సామాజికవర్గం. దీంతో బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. హుజూరాబాద్ లో గెలుపు తర్వాత ఇక ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీ చేసినా విజయం ఖాయమని ఈటెల భావిస్తున్నారట. అందుకే అక్కడ్నుంచి తన సతీమణి జమునను ఆయన నిలబెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. తాను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని ఈటెల అనుకుంటున్నట్లు టాక్. మేడ్చల్ వైపు ఆయన చూస్తున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోనే ఈటెల రాజేందర్ నివాసం ఉంది. దీంతో సమీపంలోని నేతలందరితోనూ ఈటెలకు మంచి పరిచయాలున్నాయి. పార్టీలకతీతంగా అందరూ ఆయనతో టచ్ లో ఉంటారు. బీజేపీలో చేరినప్పటికీ ఈటెలకు ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. దీంతో మేడ్చల్ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని ఈటెల అనుచరులు అనుకుంటున్నారట. అక్కడ హుజూరాబాద్ లో ఈటెల జమున, మేడ్చల్ లో ఈటెల గెలిస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినట్లవుతుంది. అప్పుడు ఆయన ఇమేజ్ రాష్ట్రవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయం. దాన్నికూడా ఈటెల బేరీజు వేసుకుంటున్నట్లు టాక్. అందుకే మేడ్చల్ నుంచి పోటీకి ఈటెల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మల్లారెడ్డి మంత్రి అయిన తర్వాత మేడ్చల్ నియోజకవర్గంపై ఆయన పట్టు తగ్గిందని ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ మల్లారెడ్డికి సరైన బలమైన ప్రత్యర్థి దొరకడం కష్టమేనని ఇతర పార్టీల నాయకులు అనుకున్నారు. కానీ సడెన్ గా ఇప్పుడు ఈటెల రాజేందర్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో మల్లారెడ్డి ధీటైన అభ్యర్థి ఈటెల రాజేందర్ మాత్రమేనని బీజేపీ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు.

మల్లారెడ్డికి అన్నిరకాలుగా సరైన ప్రత్యర్థి ఈటెల అని బీజేపీ క్యాడర్ స్పష్టం చేస్తున్నారు. ఈటెల రేసులో ఉంటే, మల్లారెడ్డికి ముచ్చెమటలే అని తేల్చిచెబుతున్నారు. ఈటెల పోటీచేస్తే ప్రచారం కూడా అవసరం లేదని,తామే ఆయనను గెలిపించుకుని వస్తామని కమలం క్యాడర్ చెబుతున్నారట. ఉన్నట్లుండి ఈటెల తెరపైకి రావడంతో మల్లారెడ్డి వర్గం కూడా ఆలోచనలో పడిందట. గత ఎన్నికల్లోలాగా వార్ వన్ సైడ్ గా ఉండదని, కచ్చితంగా టఫ్ ఫైట్ కు సిద్ధం కావాలని మల్లారెడ్డి తన సన్నిహితులతో చెబుతున్నారట.

అయితే నిజంగానే మేడ్చల్ నుంచి ఈటెల రేసులో నిలుస్తారా? బీజేపీ శ్రేణులు చెబుతున్న ప్రకారం మల్లారెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తారా? హుజూరాబాద్ లో లాగా ఇక్కడ కూడా ఈటెల విజయఢంకా మోగిస్తారా? అన్న దానిపై నియోజకవర్గంలో చర్చోపచర్చలు జోరుగా సాగుతుండడం విశేషం.