కడియం పొలికేక !! 

కడియం పొలికేక !!

కడియం పొలికేక !! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలంగాణ రాజకీయాల్లో కడియం శ్రీహరికి ప్రత్యేకస్థానం ఉంది. మేధావి వర్గానికి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. అప్పట్లో రాజయ్యను డిప్యూటీ సీఎంగా తొలగించినప్పుడు సీఎం కేసీఆర్ బెస్ట్ ఆప్షన్ గా కడియంను ఎంచుకున్నారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు.గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్నా, కడియం ఏనాడూ నోరు జారి మాట్లాడిన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. పాయింట్ ప్రకారమే మాట్లాడుతారు తప్ప అనవసర విమర్శలు ఆయన వెంట రావు. అలాంటి కడియం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని కడియం వ్యాఖ్యానించారు. ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని సూచించారు. రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదని, ఇకపై కూడా వంచబోనంటూ గట్టిగా మాట్లాడారు. ఆర్జించడం కాదు, నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పుచేసినోడే తలవంచుతాడంటూ కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు కడియం శ్రీహరి ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

కడియం శ్రీహరి, రాజయ్య ఇద్దరిదీ భిన్నమైన మనస్తత్వం. కానీ ఇద్దరిదీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం. ప్రస్తుతం రాజయ్య అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడియం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎవరికీ టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలు ఎవరికి వారు టికెట్ పై ధీమాగా ఉన్నారు. ఆ మాటకొస్తే రాజయ్యకు టికెట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ అని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అదంతా గమనించే కడియం తన వాయిస్ ను పెంచారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానానికి గట్టి సంకేతాలు పంపే ఉద్దేశ్యంతోనే ఈ హాట్ కామెంట్స్ చేశారన్న చర్చ ఓరుగల్లు పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది.

మరోవైపు కడియం వ్యాఖ్యల వెనక మరో కారణం కూడా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ లో తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని తేలిపోవడంతోనే కడియం ఈ కామెంట్స్ చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ హైకమాండ్ ను, మరోవైపు రాజయ్యను టార్గెట్ చేస్తూ కడియం ఈ మాటలు మాట్లాడారేమోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పట్లో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆత్మగౌరవం అంటూ గట్టిగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు కడియం కూడా అలాంటి మాటలే మాట్లాడ్డం అనుమానాలకు తావిస్తోంది. కొంపదీసి ఈటల బాటలో కడియం వెళ్తారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అన్నింటికి తెగించి ఆయన ఈ మాటలు మాట్లారేమో అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

కడియం నోటివెంట హాట్ డైలాగుల నేపథ్యంలో బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. తొందరపడరాదని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరినీ ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని కడియం చెప్పినట్లు సమాచారం. తన విషయంలో నాన్చకుండా క్లారిటీ ఇవ్వకపోతే, కఠిన నిర్ణయానికి కూడా తాను వెనుకాడనని కడియం అన్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుడు కడియం అవుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కడియం అంత తొందరగా అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకే ఆయన ఈ హాట్ డైలాగులు పేల్చారన్న గుసగుసలైతే బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. నిజానికి కడియం ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినా… ఆయన చెప్పాలనుకున్నది మాత్రం గట్టిగానే చెప్పేశారు. మరి దీనికి అటు హైకమాండ్ నుంచి కానీ, ఇటు రాజయ్య నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.