కీలక అంశాలకు కేసీఆర్ కేబినెట్ ఆమోదం

కీలక అంశాలకు కేసీఆర్ కేబినెట్ ఆమోదం

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వివరించారు.కీలక అంశాలకు కేసీఆర్ కేబినెట్ ఆమోదంవిశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం :
ఇక నుండి విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ద్వారా జరపాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి అమలవుతున్నది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,500 పై చిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.

ప్రైవేట్ యూనివర్సీటీలకు ఆమోదం :
రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చట్టం ప్రకారం సంబంధింత నియమనిబంధనలకు లోబడి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించాలని ఇందుకు సంబంధించి విద్యాశాఖ, వ్యవసాయశాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కేబినెట్ అనుమతించిన కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు :
కేబినెట్ అనుమతించిన కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు సీఐఐ (CII),ఏఎంఐటీవై ( AMITY),ఎంఎన్ఆర్ ( MNR),గురునానక్ ( GURUNANAK),ఎన్ఐసీఎంఏఆర్ (NICMAR)తో పాటు కావేరి అగ్రి యూనివర్సిటీ. రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీలను స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, ఇవి త్వరగా ఏర్పాటయ్యేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటును కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలని సీఎం సూచించారు. దీనివల్ల హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గడంతో పాటు, ఇతర నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కేబినెట్ ఆదేశించింది.

గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచింది. తాజాగా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా నియమించడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న విషయం తెలిసిందే. పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇక నుంచి కేవలం లిఖిత పరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలనీ, ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీ తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకే పరిమితం కాకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిపంజేయాలని తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

]జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినేట్ ఆమోదం :
సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర త్రాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశ్యం సంబద్ధతను కోల్పోయింది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి.

ఈ జలాశయాల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలో ఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంద. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇందుకోసం చీఫ్ సెక్రటరీగారి అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమనిబంధనలను ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని సీఎం కమిటీని ఆదేశించారు.కీలక అంశాలకు కేసీఆర్ కేబినెట్ ఆమోదంపల్లె ప్రగతి, పట్టణ ప్రగతి :
వచ్చే మే నెల 20 నుండి 5 జూన్ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై నిరంతర సమీక్ష నిర్వహించాలని, ఆశించిన లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరేవరకు అలసత్వం పనికిరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు సూచించారు.

చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం :
చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే, ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు చేసింది. 10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టునుండి ఈ పథకానికి వినియోగించనున్నారు. పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు.. సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు… లక్ష్మీబారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు… మొత్తంగా 90,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనున్నది.

యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆమోదం :
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండిన యాసంగి పంటను సేకరించకుండా సంకుచితంగా వ్యవహరిస్తున్న తీరును కేబినెట్ తీవ్రంగా నిరసించింది. సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నదని కేబినెట్ విమర్శించింది. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది. ఐతే ప్రజలతో, రైతులతో నిత్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పట్ల నిబద్ధతను ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ అన్నారు. వద్దన్నా రాష్ట్రంలో కొంతమంది రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడా వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై పెనుభారంగా మారింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ కన్న బిడ్డలను కాపాడుకునే తండ్రి మనస్తత్వంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది.

సివిల్ సప్లైస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించాలనీ, కలెక్టర్లతో, సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించుకొని, గన్నీ బ్యాగుల సరఫరా, తదితర సమస్యలు లేకుండా సమర్థవంతంగా కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గతంలో మాదిరిగానే కనీస మద్దతు ధర చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక రాష్ట్రంలోని రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం ఇతరులకు అమ్మి, నష్టపోవద్దని ముఖ్యమంత్రిగారు సూచించారు. కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా పై పడే అధిక భారాన్ని భరిస్తూ, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని సీఎం తెలిపారు. యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటి వేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్ళు, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.