కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన పొలిటికల్ డ్రామా

కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన పొలిటికల్ డ్రామా

వరంగల్ టైమ్స్, వరంగల్ అర్బన్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే గ్రేటర్ వరంగల్ అభివృద్ధిలో వెనుకంజలో వుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ‌్యలపై వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ కు రావడాన్ని స్వాగతిస్తూనే వరంగల్ పర్యటనకు వచ్చి కనీసం తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నలు సంధించారు.కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన పొలిటికల్ డ్రామావరంగల్ లో కిషన్ రెడ్డి పర్యటన రాజకీయ చిచ్చు పెట్టేలా వుందంటూ హన్మకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విరుచుకుపడ్డారు. రాబోయే వరంగల్ , ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో గెలవడం ఖాయమని, టీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీ లేదని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో బాధపడుతున్న బాధితులను పరామర్శించాలని, వరద బాధితులను పరామర్శించాలని నేను పలుమార్లు కోరినా పట్టింపులేని కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం లేదని, గ్రేటర్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని చెప్పడం సిగ్గుచేటని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరద బాధితులకు ఆర్ధిక సాయం నిమిత్తం రూ.12 కోట్లు మంజూరు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ , ఖమ్మం, కరీంనగర్ రోడ్లపై సుమారు 120 కిలో మీటర్ల వున్న గుంతలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూడ్చడం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కాదా అని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. టెక్స్ టైల్ పార్కుకు సహకరించకుండా , కోచ్ ఫ్యాక్టరీ పై ఇప్పటి వరకు కేంద్రం నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్రానికి ఎందుకు అంత అలసత్వమని మండిపడ్డారు. ఎయిర్ పోర్టును ప్రైవేటీకరణ చేసే కేంద్రం రాష్ట్రంలో రాజకీయ చిచ్చు పెట్టే ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ , వరంగల్ వరద బాధితులకు ఎందుకు ఆర్ధిక సాయం లేదని ఎర్రబెల్లి కేంద్రమంత్రిని ప్రశ్నించారు. దమ్ముంటే కిషన్ రెడ్డి తమతో రివ్యూలో మాట్లాడాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మరో వైపు తెలంగాణ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలను ఈ సమావేశంలో ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని బీజేపీ చేస్తోన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణ ఉద్యమకారులపై వున్న కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులను కోర్టులను చుట్టూ తిప్పించుకోవడంలో వారి నిజస్వరూపం కనబడుతుందని మండిపడ్డారు.

వరంగల్ వరద బాధితులకు వారు నష్టపోయినతీరును బట్టి జిల్లాలో సుమారు 4వేల మంది వరద బాధితులకు చెక్కుల ద్వారా ఆర్ధిక సాయం చేశామని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, చల్లాధర్మారెడ్డి స్పష్టం చేశారు. మతత్వంతో హైదరాబాద్ లో తమ బలాన్ని నిరూపించుకున్న బీజేపీ పార్టీకి వరంగల్ లో ఆ ఛాన్స్ రాదని మంత్రితో పాటు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ , ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.