అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేటీఆర్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం చేరుకున్న మంత్రి కేటీఆర్ కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ కె.రంగనాథ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కమలాపురం మండల కేంద్రంలో 43.5 కోట్లతో నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే బాలికలు, బారుల విద్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, రూ.కోటి 50లక్షలతో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ.కోటి 71లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, రూ.25లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, రూ.25లక్షలతో అయ్యప్ప గుడి, రూ.30లక్షలతో పెద్దమ్మ గుడి, గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, రూ.30లక్షలతో మార్కండేయ ఆలయం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపనలు చేశారు. రైతు వేదిక ప్రాంగణంలో రూ.69లక్షల 85వేలతో నిర్మించిన వివిధ కుల సంఘాల భవనాలను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చదువుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాసంస్కరణలు చేస్తుందని అన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరచడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని గుర్తు చేశారు. రాష్ట్ర పురోగతిని చూసి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.
అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు.మన ఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలవుతుందని అన్నారు. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను కొనసాగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన విద్య, వైద్యం, రైతు సంక్షేమం, కుల సంఘాల అభివృద్ధి అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన గౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ లు, పాడి కౌషిక్ రెడ్డి, ఎమ్మెల్యే లు ఒడితల సతీష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్,వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ ,ఎంపీపీ జడ్పీటీసీ, అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.