ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కేటీఆర్ ప్రశంసలు 

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కేటీఆర్ ప్రశంసలు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్ టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పత్తి పండించే రైతులు మన వద్ద లక్షల సంఖ్యలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు.ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కేటీఆర్ ప్రశంసలు మన పత్తి అత్యుత్తమ క్వాలిటీ కల్గిన పత్తి అని వస్త్ర వ్యాపార రంగానికి చెందిన పరిశ్రమల పెద్దలు చెప్పారు. తమిళనాడు, గుజరాత్, ఆంధ్రాలో పండిన పత్తి కంటే మన పత్తి బాగుందని చెప్పారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించేందుకు ఈ పార్కు ఏర్పాటు చేశామన్నారు. కేరళకు చెందిన ఈ పార్కు వరంగల్ కు రావడానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్, చల్లా ధర్మారెడ్డినే అని అన్నారు. వేరే ఎమ్మెల్యేలతో కాకపోయేది ఇది. చల్లా ధర్మారెడ్డి కాబట్టి పట్టుబట్టి సాధించాడని కేటీఆర్ స్పష్టం చేశారు.

చల్లా ధర్మారెడ్డిని ఉద్దేశించి స్వాతిముత్యం సినిమా స్టోరీ చెప్పిన కేటీఆర్..
స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ కు ఒకాయన ఉద్యోగం ఇస్తానని చెప్తాడు. ఇక ఉదయం ఆయన పండ్లు తోముతుంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. బాత్రూంలోకి వెళ్లి బయటకు రాగానే, అక్కడుంటడు. ఏమైంది సార్ నా ఉద్యోగమని అడుగుతడు. టిఫిన్ చేయడానికి పోతే మళ్లీ అక్కడ కనిపిస్తడు. ధర్మారెడ్డి సేమ్ టూ సేమ్. ఒక పనిని పట్టుకున్నడంటే దాన్ని సాధించేదాకా వదలడు. మంత్రులందరినీ పరేషాన్ చేస్తడు. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనినైనా పట్టువదలని విక్రమార్కుడిలా సాధించే నాయకుడు మీకు ఉండటం అదృష్టమని కేటీఆర్ అన్నారు. పరకాల కోసం, ఇక్కడి ప్రజల కోసం ప్రతీ క్షణం పరితపిస్తుంటాడు అని కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.