లాక్‌డౌన్ జూన్ 30 దాకా పొడగింపు

కరోనా లాక్‌డౌన్:జూన్ 30 దాకా పొడగింపు.. 5.0కు సలహాలు కోరిన ప్రధాని.. రాబోయే 2నెలలు భయానకం..

లాక్‌డౌన్ జూన్ 30 దాకా పొడగింపు

”ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్‌లో జరుగుతోన్న పరిణామాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఇక్కడ.. ప్రజలే సైనికులుగా మారి కరోనాపై యుద్ధం చేస్తున్నారు. జనమే ముందుండి సాగిస్తోన్న ఈ పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్ని అనుసరిస్తున్నదంతే. మనందరం నిష్ఠగా ప్రార్థనలు చేస్తే రంజాన్ పండుగరోజు నాటికి కరోనా వైరస్ అంతమైపోతుందని ఆశిస్తున్నా”.. సరిగ్గా నెలరోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’లో చెప్పిన మాటలివి.

నిన్న రంజాన్..

సోమవారం దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను జనం సాదాసీదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రధాని ఆశించినట్లు పండుగలోగా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకపోగా, రోజురోజుకూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు జులై నాటికిగానీ మన దేశంలో వైరస్ వ్యాప్తి పీక్స్ కు చేరదని నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మరికొంత కాలం ఆంక్షలు కొనసాగించాలనే వాదన ఊపందుకుంది. ఆలోపే లాక్ డౌన్ పొడగింపుపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం పొడగింపుపై హింట్ ఇచ్చారు. లాక్ డౌన్ 4.0 ముగియనున్న మే 31నే ప్రధాని మోదీ మరోసారి ‘మన్ కీ బాత్’ వెల్లడించనున్నారు. లాక్ డౌన్ ఎగ్జిట్ లేదా 5.0 ఎలా ఉండాలన్నదానిపై సూచనలు ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరారు.

జూన్ 30 వరకు పొడగింపు..

లాక్ డౌన్ 5.0పై ఇంకా పూర్తి క్లారిటీ రాకముందే, ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అక్కడి హమీర్‌పూర్, సోలాన్ జిల్లాల్లో కరోనా లాక్ డౌన్ ఆంక్షల్ని జూన్ 30 వరకు పొడగిస్తున్నట్లు సోమవారం ఆదేశాలు జారీచేసింది. హిమాచల్ అంతా కలిపినా పాజిటివ్ కేసుల సంఖ్య 217గానే ఉంది. అందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 59 మందికి ఇప్పటికే వ్యాధి నయమైపోయింది. యాక్టివ్ కేసులు 151గా ఉన్నాయి. అయితే, లాక్ డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా ఆ రెండు జిల్లాలో భారీగా రాకపోకలు జరుగుతుండటంతో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే అక్కడ 14 మందికి వైరస్ సోకింది. రాబోయే రోజుల్లో పరిస్థితి విషమించొచ్చన్న అంచనాలతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మహారాష్ట్రలోనూ తప్పదన్న సీఎం..

కరోనా వ్యాప్తిని అరికట్టాలన్న ఉద్దేశం మంచిదే అయినా, సర్దుకోడానికి సమయం ఇవ్వకుండా సడన్ గా లాక్ డౌన్ ప్రకటించడం చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ఒకేసారి లాక్ డౌన్ ఎత్తేయడం అంతకు మించిన పొరపాటు అవుతుంది. ముఖ్యమంత్రిగా నా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలని నేనూ ఆశిస్తాను. కానీ వాస్తవ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మే 31తో లాక్ డౌన్ పూర్తయిపోతుందని నేనైతే భావించడంలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం”అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మీడియాకు చెప్పారు. దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50వేలు, మరణాల సంఖ్య 1600దాటాయి.

5.0పై మోదీ ఎం చెబుతారు?

కేంద్రం పొడగించిన నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ఉద్దేశంతో లాక్ డౌన్ 4.0లో భారీగా సడలింపులు ప్రకటించడం, రెడ్ జోన్ల గుర్తింపుపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడం తెలిసిందే. ఫ్లైట్ సర్వీసులు ఉండబోవని కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల్లో రాసున్నప్పటికీ.. సోమవారం నుంచి డొమెస్టిక్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫ్లైట్, రైలు సర్వీసుల పున:ప్రారంభంపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వీటి నేపథ్యంలో మే 31న ప్రధాని చేయబోయే ‘మన్ కీ బాత్’ ప్రసంగానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. కేసుల తీవ్రత నేపథ్యంలో 5.0పైనే ఆయన ప్రసంగిస్తారని తెలుస్తోంది. మన్ కీ బాత్ లో ఏం మాట్లాడాలో మీరే చెప్పాలంటూ మోదీ.. ప్రజలను సలహాలు, సూచనలు కోరారు.

మరోసారి సీఎంలతో కాన్ఫరెన్స్?

ఇంకో ఐదు రోజుల్లో లాక్ డౌన్ 4.0 ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై ప్రధాని మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లాక్ డౌన్ కాలంలో ఇప్పటికే ఐదు సార్లు మీటింగ్ నిర్వహించారు. మే 12న జరిగిన చివరి కాన్ఫరెన్స్ లో కేంద్రం, రాష్ట్రాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. రెడ్ జోన్లు, లాక్ డౌన్ నంబంధనలపై నిర్ణయాధికారం తమకే కావాలని ముఖ్యమంత్రులు డిమాండ్ చేయడంతో ఆ మేరకే హోం శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. కానీ గతవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గత వారం రాసిన లేఖలో రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించడం, స్థానిక యంత్రాంగం వైఫల్యం వల్లే కేసులు పెరుగుతున్నాయనడం కలకలం రేపింది. హిమాచల్ ప్రదేశ్ లో రెండు జిల్లాల్లో లాక్ డౌన్ పొడగింపు ఆదేశాలు వచ్చినా, దేశవ్యాప్తంగా 5.0పై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

టాప్-10లోకి భారత్..

లాక్ డౌన్ 4.0 సడలిపుల్లో భాగంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు పున:ప్రారంభమైన సోమవారం నాటికి దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,977 పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,845కి చేరగా, మరణా సంఖ్య 4,021కు పెరిగింది. కేసుల్లో సోమవారం నాటి పెరుగుదలతో భారత్.. ప్రపచంలోనే వరస్ట్ టాప్-10లోకి ప్రవేశించినట్లయింది. అదీగాక, వచ్చే రెండు నెలలు భారత్ భయానక పరిస్థితిని చవిచూడబోతోందని, జూన్ లో కేసులు భారీగా పెరిగి, జూలైలో పీక్స్ కు చేరుతుందని ప్రముఖ అపిడమాలజిస్ట్, కేర్ ఇండియా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తన్మయ్ మహాపాత్ర అంచా వేశారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలను మరింత కఠినతరం చేసి, టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.