పేరు సార్థకం చేసుకోండి : మంత్రి కేటీఆర్

పేరు సార్థకం చేసుకోండి : మంత్రి కేటీఆర్

మన ఊరు –మన బడిలో భాగస్వాములు కండి
పుట్టిన గడ్డకు సేవచేసే అవకాశం
రూ.7వేల కోట్లతో రాష్ట్రంలోని 23 వేల పాఠశాలల అభివృద్ధి
అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌

వరంగల్ టైమ్స్ , అమెరికా : జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి పథకాల్లో భాగస్వాములు కావాలని కోరారు. పేరు సార్థకం చేసుకోండి : మంత్రి కేటీఆర్అమెరికా పర్యటలో ఉన్న ఆయన బుధవారం శాన్‌జోస్‌లో ఇండియన్‌ అమెరికన్‌ డయాస్పొరా ఏర్పాటుచేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ కేటీఆర్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మన ఊరు –మన బడి కార్యక్రమం ఎన్‌ఆర్‌ఐలపై ఆధారపడి ఏర్పాటు చేసింది కాదని అన్నారు. కానీ పుట్టిన ఊరు, పుట్టిన రాష్ట్రం, మాతృదేశానికి సేవ చేసుకొనేందుకు ఈ పథకం మంచి అవకాశమని తెలిపారు. ఈ సందర్భంగా మన ఊరు- మన బడి ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌ను ఆవిష్కరించారు.

సంతృప్తి కోసం చేయండి..
మాతృభూమికి సేవ చేయటంలో గొప్ప సంతృప్తి ఉంటుందని మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. ‘మాతృభూమికి దూరంగా ఉండేవాళ్ల ఆరాటం నాకు తెలుసు. ముఖ్యంగా వేల మైళ్ల దూరంలో ఉన్నవాళ్లకు పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చేయాలన్న కోరిక ఉంటుంది. నేను కూడా ఇక్కడే (అమెరికాలో) ఆరున్నరేండ్లు ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. మీరు మీ పేరును సార్థకం చేసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్నది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగస్వాములు కండి. గుడులు కట్టించేవాళ్లు గుడులు కట్టించండి. బడులు కట్టించేవాళ్లు బడులు కట్టించండి. కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనుకొంటే ఇవ్వండి.

దానివల్ల మీకు లభించే సంతృప్తి మరే ఇతర పనుల వల్ల రాదు. మీ గ్రామంలో పాఠశాలలు బాగు చేయిస్తే అక్కడి ప్రజలు చూపే ఆదరణ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. పాఠశాలలు అభివృద్ధి చేస్తే వాటికి మీ పేరు లేదా మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొనే అవకాశం కూడా ఉన్నది. దీంతో మీ పేరు సార్థకమవుతుంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల సహకారం తీసుకోవాలని అనుకొంటున్నాం. మీకు ఇష్టమున్న పాఠశాలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేయండి.’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం కూడా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.