31 నుంచి కొవిడ్ నిబంధనలు ఎత్తివేత
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతుండటంతో రెండేళ్లుగా అమల్లో ఉన్న కొవిడ్ నిబంధనలను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను మాత్రం యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. దేశంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు 2020 మార్చి 24న ‘విపత్తు నిర్వహణ చట్టం 2005’ కింద కేంద్రం పలు నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
అనంతరం దఫదఫాలుగా మార్పులు, చేర్పులు చేసింది. ఈనెల 31 నుంచి వాటన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలు కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని.. ఇది పూర్తిగా ‘అవాస్తవం’ అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులు, మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించాలని స్పష్టం చేశారు. ఒకవేళ మరోసారి కేసులు పెరిగితే..వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
*కొవిడ్ ప్రత్యేక వైద్య వసతులను అందుబాటులో ఉంచుకుంటూనే.. ఇకపై అన్ని రకాల వైద్యసేవలు, వసతులను అందుబాటులోకి తేవాలి.
*తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. సామాజిక క్రీడలు, వినోదంతో పాటు విద్యావిషయక, సాంస్కృతిక, ఉత్సవాల సంబంధిత కార్యకలాపాలను పునరుద్ధరించవచ్చు.
*విద్యాసంస్థల్లో ఆఫ్‌లైన్ తరగతులను పునఃప్రారంభించుకోవచ్చు. హైబ్రిడ్ మోడల్ విద్యావిధానాన్ని కూడా పరిశీలించవచ్చు.
*అన్ని రకాల ప్రజా రవాణాతో పాటు.. దుకాణ సముదాయాలు, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, స్పాలు, ఈత కొలనులు, మతపరమైన ప్రాంతాలను పూర్తి సామర్థ్యంతో నడపవచ్చు. ఈమేరకు వివాహాలు, అంత్యక్రియలకు కూడా అనుమతించారు.
*అంతర్రాష్ట్ర రవాణకు ఇక ఎలాంటి నిబంధనలు ఉండవు.
*అన్ని పారిశ్రామిక, శాస్త్రపరమైన సంస్థలు; ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను కూడా పూర్తి సామర్థ్యంతో నిర్వహించవచ్చు.
*100% వ్యాక్సినేషన్ సాధించేందుకు రాష్ట్రాలు, యూటీలు కృషి చేయాలి.*
*10%కి మించి పాజిటివిటీ రేటు ఉన్న.. ఆక్సిజన్ లేదా ఐసీయూ పడకలు 40% నిండిన ప్రాంతాల్లో మాత్రం అవసరమైన నిబంధనలు అమలు చేయాలి. ‘పరీక్షలు జరపడం, కేసులు గుర్తించడం, చికిత్సలు అందించడం, వ్యాక్సినేషన్, అప్రమత్తత’ అనే ఐదంచెల విధానాన్ని కొనసాగించాలి. హోం ఐసొలేషన్ నిబంధనలను పాటించాలి.
*జిల్లా స్థాయిలో కొత్త కేసుల విషయమై నిరంతరం సమీక్షిస్తుండాలి. అంతర్జాతీయ ప్రయాణికుల శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణకు పంపించాలి.
*ఇన్‌ఫ్లుయాంజా తరహా అనారోగ్యం, తీవ్రమైన శ్వాస సంబంధిత వ్యాధులపై పర్యవేక్షణ ఉండాలి.*