ప్రారంభమైన మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర
warangal times, ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో కుమ్రంభీం, అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ ఠాక్రే జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ ఠాక్రే, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్, జావిద్, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావ్ లు పాల్గొన్నారు. పాదయాత్రకు వచ్చిన సీఎల్పీ నేత విక్రమార్కకు ఆదివాసీలు గుస్సాడి నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది హారతులిచ్చారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజుల పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలో మీటర్ల మేర భట్టి పాదయాత్ర షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని భట్టి విక్రమార్క అన్నారు.