చెత్త సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మేయర్ 

చెత్త సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మేయర్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : చెత్తను డీఆర్సీసీ కేంద్రాలకు విధిగా అందజేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 42 వ డివిజన్ లో గల డీఆర్సీసీ కేంద్రంతో పాటు 11వ డివిజన్ పోతన నగర్లో గల ద్వితీయ చెత్త సేకరణ కేంద్రాన్ని మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో చెత్త తరలింపు విధానాన్ని పరిశీలించారు. ఆటోల ట్రిప్పుల వివరాలు లాగ్ బుక్ లలో పరిశీలించగా ప్రతీరోజు 3 ట్రిప్పులు వేయాల్సి ఉండగా ఒకటి, రెండు ట్రిప్పులు వేసిన ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ఎంహెచ్ఓ ను మేయర్ ఆదేశించారు. అందుబాటులో లేని పోతన డంపింగ్ యార్డ్ ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.చెత్త సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మేయర్ వాహన ట్రాకింగ్ నిర్వహణ సరిగ్గా జరగాలని, తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ క్షేత్ర స్థాయిలోనే జరగాలని సూచించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తడి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించడంతో పాటు, పొడి చెత్తను బల్దియా నిర్వహిస్తున్న డీఆర్సీసీ సెంటర్లకు అందజేయాలని తెలిపారు. ప్రతీ స్వచ్ఛ ఆటో ప్రతీ రోజు సమయ పాలన పాటిస్తూ నిర్దేశిత ట్రిప్పులతో పాటు చెత్తను డంప్ యార్డ్ లకు తరలించాలని చెప్పారు. ప్లాస్టిక్ నియంత్రణలో కీలక భూమిక పోషించాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ జవాన్స్, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.